ప్రస్తుతం ఉలఘనాయగన్ అని అన్ని భాషల చిత్రపరిశ్రమలవారూ కొనియాడిన కమల్ హసన్కిప్పుడు ఆనాడు వాయిస్ కింగ్ సాయికుమార్‌కి పట్టిన గతే పట్టింది. భాషల విషయంలో కన్నడవారు పట్టినబట్టుకి తిరుగేలేదని గతచరిత్ర అనేకసార్లు నిరూపించింది. వాళ్ళ భాష జోలెత్తినా, వాళ్ళ చిత్రపరిశ్రమలోని వారిని ఎవరైనా కించపరిచినట్టుగా మాట్లాడినా, లేదా బెంగళూరులో నిలబడి మరోభాషా నటుడిని పొగిడినా కూడా కనడిగులకు ఛిర్రెత్తిపోతుంది. ఎవరినైనా సరే చీల్చి చెండాడుతారు. అందులో వాళ్ళకి కాంప్రమైజ్ అన్నదే లేదు.
ప్రస్తుతం కమల్ హసన్ అటువంటి వైషమ్యాన్నే ఎదుర్కొంటున్నారు. తమిళభాషలో నుంచే కన్నడ భాష ఆవిర్భవించిందన్న కమల్ మాటకి కర్ణాటక మొత్తం భగ్గుమంది. కమల్ ఎంత గొప్ప నటుడు అనే విషయాన్నే పూర్తిగా విస్మరించి, కమల్ని నానా బూతులు తిడుతున్నారు. ఆయన లేటెస్ట్ సినిమా మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న థగ్ లైఫ్ చిత్రం విడుదల సందర్భంగా బెంగళూరులో జరిగిన ఈవెంట్లో కమల్ అనాలోచితంగా, అర్ధం పర్థం లేకుండా, అస్సలు సందర్భానికి ఏ మాత్రం సంబంధం లేకుండా తమిళభాషలోనుంచే కన్నడ భాష పుట్టిందీ అని సాగదీస్తూ ఎవడు మాట్లాడమన్నాడు. అసలు థగ్ లైఫ్‌కీ తమిళంలోనుంచి కన్నడభాష్ పుట్టిందని చెప్పడానికి ఏమైనా సంబంధం ఉందా? ఒక వయసు దాటిపోయి, వార్ధక్యం అలుముకుని, వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయి రామకృష్ణా అనుకునే వయసులో కమల్ లాంటివాళ్ళు ఇంకా సినిమా పరిశ్రమని పట్టుకుని వేళ్ళాడుతూ, తగుదునమ్మా అని నటిస్తూ ఇటువంటి పేలాపనలు పేలడం కేవలం బూతులు తినడానికి తప్పితే దేనికీ పనికిరాదు. తాజాగా డిఎంకె పార్టీతో చేతులు కలిపిన కమల్ తమిళులను పొంగేయడానికి ఇటువంటి వాగుడుకి దిగాడు. దీనికింక మరే పరమార్థం ఎవ్వరికీ కనిపించడం లేదు.
గతంలో ఒకసారి డబ్బింగ్ సాయికుమార్‌కి ఇటువంటి దుస్థితే ఎదురైంది. కన్నడ చిత్రపరిశ్రమే కాదు, బెంగళూరులో ఉన్నవారందరూ తన్నబోయి, తన్నేరేమో కూడా తెలియదు కానీ, అంతపనీ చేసి బెంగళూరు నంచి వెంట తగిలారు. ప్రాణభయంతో సాయికుమార్ తక్షణమే పెట్టేబేడా సద్దుకుని మద్రాసు పారిపోయాడని పేపర్లన్నీ మోతెక్కిపోయాయి. పోలీస్ స్టోరీ అనే చిత్రాన్ని కన్నడ దర్శకుడు, నిర్మాతే నిర్మించారు. సాయి కుమార్‌కి కన్నడంలో కూడా మంచి ఆదరణే లభించింది అప్పట్లో. దాంతో సంతృప్తి చెందకుండా సాయికుమార్ కొంచెం పైత్యం ప్రదర్శించాడు. ఎంతైనా ఆదరిస్తారు, మరెంతైనా నెత్తి మీద పెట్టుకుంటారు కన్నడంలో. కానీ తేడాగా మాట్లాడితే మాత్రం తాటతీస్తారు. వాళ్ళకి కమలైనా, సాయకుమారైనా, దేవుడైనా లెక్కలేదు. సాయికుమార్ ఏదో సభలో మాట్లాడుతూ, తాను అమ్మ కడుపులో ఉన్నప్పుడే నడిగర్ తిలగం శివాజీ గణేశన్కి పిచ్చాభిమానినని అన్నాడు.
అంతే కర్ణాటకలో అగ్గి భగ్గుమంది. బెంగళూరు బాంబులా పేలింది. ఏంరా,…..హౌలేగా, మేమిక్కడ నిన్నింత గౌరవించి, భుజాలమీదకి ఎక్కించుకుని ముద్దు చేస్తుంటే నువ్వేమో అమ్మ కడుపులో ఉన్నప్పుడే శివాజీ ఫేన్వా. అంటే మా కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ వేస్ట్ అనా నీ ఉద్దేశ్యం అని పెట్రోల్ బాటిల్స్ పట్టుకుని మరీ దండయాత్రకి బయల్దేరారని అప్పట్లో బాగా చెప్పుకున్నారు.
తాను శివాజీ అభిమానినని చెప్పుకుంటేనే సహించని కన్నడవాసులు, కమల్ ఇంత మాట అంటే ఊరుకుంటారా. ప్రశ్నే లేదు. కొంప కొల్లేరు చేసేస్తారు. చేస్తున్నారు. కమల్ మాట్లాడిన మాటలు మామ్మూలు మంటలు పుట్టించలేదు. హిందీ భాషని ప్రవేశపెట్టడానికే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు, నిరసనలు, ఆత్మాహుతులు చేసి మొత్తానికి హిందీవ్యాప్తికి తమ ప్రాణాలను సైతం అడ్డేసిన కన్నడిగులతోనా పరాచికాలు? ససేమిరా వాళ్ళు క్షమించే ప్రసక్తే లేదు.
ఇదెంత వరకూ వెళ్లిందంటే, థగ్ లైఫ్‌ని బ్యాన్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయింది. కోర్టు కేసు కూడా అవుతోంది. కన్నడిగుల మనోభావాలు దెబ్బతీసినట్టుగా మాట్లాడినందుకు బేషరతుగా క్షమాఫణలు చెప్పమని కోర్టు నిర్దేశించింది. లేకుంటే థగ్ లైఫ్‌ని ఆడినవ్వం అని తెగేసి చెప్పేసింది. ఇంకా ఇది చాలా నయం. కమల్ హసన్ మీద ఎంతో గౌరవభావంతో కన్నడ కోర్టు తీసుకున్న సముచితమైన నిర్ణయం. కానీ, కమల్ హసన్ గనక సినిమా కోసం ఏమాత్రం తగ్గి, క్షమాపణలు చెప్పాడా కమల్ పనైపోయిందన్నమాటే. తమిళులు కూడా ఏం తక్కువ కాదు. వాళ్ళూ అంతే భాష పిచ్చివాళ్లు. వాళ్ళకి ఎన్ని భాషలొచ్చినా సరే అరవం తప్ప మరొకటి మాట్లాడనే మాట్లాడరు. చచ్చినట్టు మనం తమిళం నేర్చుకుని అందులో అఘోరించాల్సిందే గానీ మరో గత్యంతరమే లేదు అక్కడ. అలాంటిది కమల్ క్షమాపణల వరకూ వస్తే ముందుగా డిఎంకెతో అన్ని సంబంధాలు తెగతెంపులైపోతాయి. కమల్ పరువు రోడ్ల మీదకి వచ్చేస్తుంది. ఇది ఖాయం. దేవుడు కూడా తప్పించలేడు.
తెలుగులా కాదు. మనవాళ్ళు ఒట్టి వెధవాయిలోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు గారన్నట్టు, మన తెలుగుని ఎవ్వడు ఎలా అన్నా మనకి సిగ్గూ శరం లేదు కాబట్టి ఏం ఫరవాలేదు. కానీ తమిళ్ అలా కాదు. వాళ్లు ప్రతీపాటలో తమిళభాషని ఎంతో పొగుడుకుంటారు. పూజిస్తారు. అంతెందుకు….మొన్నటివరకూ తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన మహిళామణి పేరు తమిళ ఇసై. అంటే తమిళ సంగీం అని. చూశారా. మనవాళ్ళెవరైనా తెలుగు సంగీతం అని గానీ, తెలుగు పాట అనిగానీ ఆడపిల్లలకి పేరు పెట్టుకుంటారా.
ఏదైనా పడితే గిడితే కన్నడకీ ,తమళ్కే పడాలి. పడింది. కమల్ హసనా క్షమాఫణలు చెప్పలేని దురవస్థ. బలైపోయేది పాపం, పాపం….థగ్ లైఫ్.
కొస మెరుపు….
తాజా వార్త ఏంటంటే, సదరు కమల్ అసలు కర్ణాటకలో సినిమా రిలీజే వద్దంటున్నాడంట. వద్దని కమల్ అనడమేంటి? సిగ్గు లేకుండా వాళ్ళే రానివ్వరు. గట్టిగా మాట్లాడితే మద్రాసు టు బెంగళూరు ఫ్లైట్ టిక్కటు కూడా కమల్‌కి ఇస్యూ చేయరు. నోరు మూసుకుని కమల్ కూర్చోవడమే మిగిలింది.