వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ ఓ రేంజ్లో ఉండబోతోంది. అయితే దాని కంటే ముందే మరో ఇంట్రెస్టింగ్ వార్ జరగబోతోంది. మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరో నిఖిల్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రవితేజ నుంచి ‘ధమాకా’ అనే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో.. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్న రవితేజ(ravi teja).. ధమాకా పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.
అయితే పలుమార్లు వాయిదా పడుతు వస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ చేయబోతున్నట్టు.. దీపావళి సందర్భంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు.. అదే రోజు నిఖిల్ నటిస్తున్న ’18 పేజెస్’ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా ‘కార్తీకేయ 2’తో సాలిడ్ హిట్ అందుకున్నాడు నిఖిల్. దీని తర్వాత వస్తున్న చిత్రం కావడంతో.. 18 పేజెస్(18 pages movie) పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. సుకుమార్ రైటింగ్స్‌లో.. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పైగా ఇందులో కూడా ‘కార్తికేయ2’ జోడి నిఖిల్, అనుపమా కలిసి నటించారు.
అందుకే పెరిగిన అంచనాలకు తగ్గట్టు.. ఈ సినిమాను రీ షూట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడ్డ ఈ చిత్రాన్నికూడా డిసెంబర్ 23న రిలీజ్ చేయబోతున్నారు. దాంతో ఆ రోజు ‘ధమాకా'(dhamaka) వర్సెస్ ’18 పేజెస్’గా మారనుందని చెప్పొచ్చు. అయితే ఇద్దరికీ కూడా ఈ సినిమా రిజల్ట్స్ కీలకం కానున్నాయి. రవితేజ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తుండగా.. నిఖిల్ దాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.