తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే. దసరా రోజున పార్టీ పేరును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో… షర్మిల కేసీఆర్ పై మండిపడ్డారు. ప్రస్తుతం ఆమె ప్రజా ప్రస్తానం యాత్ర చేస్తుండగా… ఈ యాత్రలో భాగంగా అధికార పార్టీపై మండిపడ్డారు.
సీఎం కేసీఅర్ మహాత్మా గాంధీ తో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. దొంగ దీక్షలు చేసిన వాళ్లు మహాత్ముడితో పోల్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. కోట్ల మంది ప్రజలు కొట్లాడి.. లక్షల మంది ఆస్తులు త్యాగం చేసి.. వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చిందని ఉద్ఘాటించారు. ఇవ్వనీ వదిలేసి.. తాను మాత్రమే తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబసభ్యులు ఎప్పుడైనా లాఠీ దెబ్బలు తిన్నారా.. కేసీఆర్ ఎప్పుడైనా ఆస్తులు త్యాగం చేశారా..? కేసీఆర్ ఇంట్లో ఎంత మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు…? అంటూ ప్రశ్నలు సంధించారు. గడ్డాలు పెంచి.. దొంగ దీక్షలు చేశారని ఆరోపించారు. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె మరిచిపోయారని ఎద్దేవా చేశారు.
మహాత్మా గాంధీ ఒక నిస్వార్థ పరుడని.. కేసీఆర్ ఒక స్వార్థ పరుడు, అవినీతి పరుడని షర్మిల ఆరోపించారు. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర ఖజానా మొత్తం లూటీ చేసి.. ఇప్పుడు దేశాలు ఏలడానికి విమానాలు, హెలికాఫ్టర్లు కొంటున్నారని విమర్శించారు. వందల కోట్ల ప్రజా ధనాన్ని పార్టీ కోసం ఖర్చు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్కు గాంధీ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదని షర్మిల వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణ.. బార్ల తెలంగాణగా మార్చారని దుమ్మెత్తిపోశారు. కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ పేరు బీఆర్ఎస్ అని వార్తలు వస్తున్నాయని.. బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అంటూ కొత్త నిర్వచనమిచ్చారు.