తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టి మరీ ఆయన జాతీయ రాజకీయాల కోసం కృషి చేస్తూ ఉన్నారు. అయితే.. తాజాగా ఆయన తన జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం కరారు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు… ఆయన జాతీయ రాజకీయాల్లో బిజీ అయితే… తర్వాత టీఆర్ఎస్ పార్టీ ని ఎవరు చూసుకుంటారు అనే అనుమానం కూడా ఉండేది.
ఈ మొత్తం వ్యవహారం పైన క్లారిటీ ఇచ్చేందుకు దసరా పండుగ రోజు గులాబీ బాస్ కీలక ప్రకటన ఉండనుందని సమాచారం. దీని కోసం దసరా పండుగ నాడు పార్టీ కార్యాలయంలో శాసనసభా పక్షం, కార్యవర్గ భేటీ సమావేశంకానుంది. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చుతూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించే అవకాశం ఉంది. ఇదే తీర్మానంను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. టీఆర్ఎస్..జాతీయ పార్టీగా రూపాంతరం చెందితే భారత్ నిర్మాణ్ సమితిగా మారుతుందనే వాదన పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది.
కొంత కాలంగా కేసీఆర్ ప్రధాని మోదీ లక్ష్యంగా పలు పార్టీల నేతలతో సమావేశమయ్యారు. అందులో ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, స్టాలిన్, నితీశ్ కుమార్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ వంటి వారితో జాతీయ రాజకీయాల పైన చర్చించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ , కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి,యూపీ మాజీ సీఎం అఖిలేష్ తోనూ సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఇదే సమయంలో శరద్ పవార్, నితీశ్ వంటి వారు కాంగ్రెస్ తో కలిసిన కూటమి కలిసి కట్టుగా బీజేపీ నుంచి అధికారం దూరం చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ లేకుండా లక్ష్యం చేరుకోవటం కష్టమని వ్యాఖ్యానించారు. ఇటు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ తో కలిసి నడవటానికి సీఎం కేసీఆర్ సిద్దమేనా, కాదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
బీహార్ సీఎం నితీశ్ థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతుంటే, కేసీఆర్ కొంత కాలంగా ప్రత్యామ్నాయ రాజకీయ విధానం గురించి ప్రస్తావిస్తున్నారు, మారాల్సింది పదవుల్లో ఉన్న నేతలు కాదని, విధానాలని చెబుతూ వచ్చారు. గత మూడు నెలల కాలంలో పలు జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్, జాతీయ రాజకీయాల్లో తాను క్రియాశీలకంగా వ్యవహరించే అంశం పైన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు, పలువురు మేధావులు, అన్ని రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలతోనూ సమావేశమయ్యారు.
అందరూ కేసీఆర్ చెప్పుకొస్తున్న విధానాలతో దాదాపుగా ఏకీభవించారు. ఇక, దసరా రోజున అధికారిక లాంఛనాలు పూర్తి చేసి కొత్త పార్టీ ప్రకటనకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. ఆ తరువాత హైదరాబాద్ కేంద్రంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జాతీయ పార్టీ జెండా – అజెండా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, తెలంగాణ సీఎంగా కొనసాగుతూనే జాతీయ రాజకీయాల్లో తన పాత్ర పోషించేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నారు.