»Congress Mla Jagga Reddy Meet To Cm Kcr In Assembly Chamber
Telangana CM KCRతో జగ్గారెడ్డి భేటీ.. కాంగ్రెస్ లో కలకలం
అలా వెళ్లి ఇలా కలిసొచ్చేలోపు ఈ వార్తలు రావడంపై జగ్గారెడ్డి స్పందించారు. అరె నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రిని కలిశానని, దానిలో తప్పేముంది? అని జగ్గారెడ్డి ఎదురు ప్రశ్నించారు. పార్టీ మారుతున్న విషయాన్ని మాత్రం ఖండించకపోవడం గమనార్హం. ఎంపీలు ప్రధానిని కలిస్తే తప్పు లేదా అని పరోక్షంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారాన్ని లేవనెత్తారు.
ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న కొద్దీ తెలంగాణ (Telangana) రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల కోసం ఆయా పార్టీలు సన్నాహాక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులు ఎన్నికలకు శంఖారావం పూరించారు. చాలా మంది నాయకులు ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. ప్రస్తుతానికైతే తెలంగాణలో మరోసారి గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరిలో ఉన్న అభిప్రాయం. కేసీఆర్ (KCR) మూడోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమనే సర్వేలు వస్తున్నాయి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ (BRS Party)గా మారినప్పటి నుంచి ఆ పార్టీకి మరింత జోష్ వస్తోంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ గులాబీ వికసిస్తోంది.
అయితే రాష్ట్రంలో పరిస్థితులు గులాబీ పార్టీకి అనుకూలంగా మారిపోతున్నాయి. మొదటి నుంచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (KTR)ను ప్రశంసల్లో ముంచెత్తుతున్న కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. సొంత పార్టీ నేతలతో జత కట్టాడు.. తానే మోనార్క్ అంటూ సంగారెడ్డి జిల్లాలో చక్రం తిప్పుతున్నాడు. అయితే ఆయన అధికార పార్టీకి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నాడని తాజా పరిస్థితులు చూస్తే చెప్పవచ్చు.
బడ్జెట్ సమావేశాల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) కలిశాడని సమాచారం. అసెంబ్లీ హాల్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమైనట్లు తెలుస్తున్నది. ఈ సమాచారం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రిని జగ్గారెడ్డి కలవడం కాంగ్రెస్ లో అలజడి రేపింది. బీఆర్ఎస్ లో జగ్గారెడ్డి చేరుతారా అనే చర్చ కొనసాగింది. అయితే అలా వెళ్లి ఇలా కలిసొచ్చేలోపు ఈ వార్తలు రావడంపై జగ్గారెడ్డి స్పందించారు. అరె నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రిని కలిశానని, దానిలో తప్పేముంది? అని జగ్గారెడ్డి ఎదురు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడాడు. ‘సీఎం కేసీఆర్ తన చాంబర్ లో నాకు టైం ఇచ్చిండు. మెట్రో రైలు సంగారెడ్డి (Sangareddy), సదాశివపేట వరకు పొడిగించాలని కోరేందుకు సీఎం కేసీఆర్ ను కలిశా. దళితబంధు పథకం కింద 500 మందికి ఆర్థిక సహాయం చేయాలని పేర్లు ఇచ్చా. మహబూబ్ సాగర్ అభివృద్ధిపై నివేదించా. సిద్దాపూర్ లో 5000, కొండాపూర్ లో 4000 ఇండ్ల స్థలాలు, సంగారెడ్డి చెరువులు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటిపై ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చా. ఏ పనులు ముందు అవుతాయో వాటిని చేయాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ప్రగతిభవన్ లో నియోజకవర్గ పనులపై అపాయింట్మెంట్ కోరాను. నియోజకవర్గంలో రోడ్లు, డ్వాక్రా గ్రూప్ భవనాలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రిని కలిసి విన్నవించా’ అని జగ్గారెడ్డి వివరించారు. అయితే కేసీఆర్ ను కలవడంపై మీడియా ప్రశ్నించగా.. ఎంపీలు ప్రధానిని కలిస్తే తప్పులేదు.. కానీ, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిస్తే తప్పా’ అని ఎదురు ప్రశ్నించారు.
ఎంపీలు ప్రధానిని కలిస్తే తప్పు లేదా అని పరోక్షంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారాన్ని లేవనెత్తారు. ఇటీవల ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని మోదీ (Narendra Modi)ని కలిసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీ (BJP)లో చేరేది ఎప్పుడో ఖాయమైంది. ప్రధానిని కలిసిన నాడు ‘భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలపై ప్రధానిని కలిశా’ అని కోమటిరెడ్డి వివరణ ఇచ్చాడు. ఇప్పుడు అతడి మాదిరే జగ్గారెడ్డి సమాధానం ఇచ్చాడు. అయితే జగ్గారెడ్డి పార్టీ మారుతున్న విషయాన్ని మాత్రం ఖండించకపోవడం గమనార్హం.