నీట్ పరీక్షల విషయంలో ఏం జరుగుతోందో తెలియక దేశంలోని విద్యార్థులంతా ఆందోళనలో ఉన్నారని పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్‌లో పరీక్షల విధానం మోసపూరితంగా ఉందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ విషయమై ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే?
Parliament Budget Session 2024 : పార్లమెంటులో నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గళమెత్తారు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులంతా చాలా ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ధనికులై ఉంటే పరీక్ష పేపర్లను కొనేసుకోవచ్చనే అభిప్రాయం చాలా మందిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నీట్(NEET) విషయంలో కేంద్రం ఏం చేస్తోందో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి(Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ గతంలో ప్రతి ఒక్కరినీ నిందించారని అన్నారు. అయితే తన దగ్గరకు వచ్చేసరికి మాత్రం లోపాలను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలపాలని అన్నారు.
ఈ దేశంలో నీట్ పరీక్షల్లోనే కాకుండా, అన్ని పెద్ద పెద్ద ప్రధాన పరీక్షల్లోనూ లోపాలు, సమస్యలు ఉన్నాయని రాహుల్ గాంధీ( Rahul Gandhi) ఆరోపించారు. ఆ విషయం దేశ ప్రజలు అందరికీ తెలుసునన్నారు. మొత్తం భారతీయ పరీక్షా విధానమే ఒక మోసమని అన్నారు. డబ్బుంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంని కొనేయొచ్చని లక్షలాది ప్రజల అభిప్రాయమంటూ దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు సైతం దీనితో ఏకీభవిస్తున్నాయని అన్నారు. ఈ విషయమై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్‌యాదవ్ సైతం కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. పేపర్ లీకుల విషయంలో మోదీ ప్రభుత్వం రికార్డు సృష్టించేలా ఉందంటూ ఎద్దేవా చేశారు.