Up : హథ్రస్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను పరామర్శించిన రాహుల్
ఉత్తరప్రదేశ్‌లోని హథ్రస్లో తొక్కిలాటలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ బాధిత కుటుంబాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Hathras Stampede : హథ్రస్ తొక్కిసలాటలో గాయ పడిన వారి కుటుంబాలను, మృతుల కుటుంబాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పరామర్శించారు. వారిని ఆప్యాయంగా పలకరించి, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ(congress Party) తరఫున తప్పకుండా బాధిత కుటుంబాలకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ అలీగఢ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వెంట యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్(Rahul) తాజాగా దూకుడును పెంచినట్లు కనిపిస్తున్నారు. అందులో భాగంగానే ఇలా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జులై 2వ తేదీన ఈ రాష్ట్రంలోని హథ్రస్(Hathras) జిల్లా ఫుల్‌రయీలో సత్సంగ్ జరిగింది. ఆ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 116 మంది మరణించారు.
ఈ ఘటనలో కొంత మంది తీవ్రంగా గాయడపడ్డారు. వారు ఇంకా ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. మృతుల్లో ఏడుగురు పిల్లలు సైతం ఉన్నారని అలీగఢ్ రేంజ్ ఐజీ శలాభ్ మథుర్ తెలిపారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.