భారత జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో వినోద్ కాంబ్లిపై కేసు నమోదైంది. వినోద్ కాంబ్లీ మద్యం మత్తులో తనతో గొడవపడి దుర్భాషలాడాడని, తలపై బలంగా కొట్టాడనిఆయన భార్య ఆండ్రియా హెవిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వంట పాన్ హ్యాండిల్‌ని తనపైకి విసిరి, తనను తీవ్రంగా గాయపర్చినట్లు వినోద్ కాంబ్లిపై ఆండ్రియా ఫిర్యాదు చేసింది. గొడవ సమయంలో తమ 12 ఏళ్ల కుమారుడు కాంబ్లీని శాంతింపజేసేందుకు ప్రయత్నం చేసినా కాంబ్లీ వినిపించుకోలేదని తెలిపింది. తనను తీవ్రంగా గాయపర్చినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. గాయపడిన తర్వాత ఆండ్రియా భాభా ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నట్లు తెలిపింది. కారణం లేకుండా తనను, తమ కుమారుడిని ఇబ్బంది పెట్టినట్లు ఆండ్రియా ఫిర్యాదు చేసింది.
తరచూ వివాదాలతో వార్తల్లో నిలిచే కాంబ్లి మరోసారి తన భార్య ఫిర్యాదుతో చిక్కుల్లో పడ్డాడు. కొంతకాలం క్రితం కాంబ్లీ మద్యం తాగి వాహనం నడుపుతూ వార్తల్లో నిలిచారు. ఇటీవలె కాలంలో తనకు సంపాదన లేదని, బతుకు భారంగా ఉందని ఓ ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. ప్రస్తుతం కాంబ్లీపై ఆయన భార్య ఆండ్రియా ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారిస్తున్నారు.