హాథ్ సే హథ్ జోడో యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు జిల్లా నుంచి ప్రారంభించేందుకు సర్వం సిద్దమైయింది. అదేవిధంగా రేపటి సమావేశంలో నాయకుల పర్యటనలకు సంబంధించిన రూట్ మ్యాప్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాత్రపై టీపీసీసీ ప్రణాళికలు వేసుకుంది. కేంద్రంలోని ఎన్డీఏ, తెలంగాణ లోని బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని టీపీసీసీ నేతలు తెలిపారు. రేపు తెలంగాణలోని ప్రతి నియోజక వర్గంలో ఓ నేత ఇందులో పాల్గొనాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ సహా ఇతర నేతలు పాల్గొనాలని నిర్ణయించారు.
అలాగే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొన్ని రోజుల్లో 50 నియోజక వర్గాల్లో పర్యటిస్తారు. ఇప్పటికే రూట్ మ్యాప్ పై కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చింది. నాలుగు కారవాన్లను సన్నద్ధం చేశారు. జనరేటర్లు, సౌండ్ సిస్టమ్ వాహనాలను కూడా వాడనున్నారు. కాగా, ఈ నెల 24 నుంచి 26 వరకు రాయ్ పూర్ లో ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రకు మంచి స్పందన రావడంతో అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది.