»Nag Ashwin Opens Up On His Prabhas Starrer Kalki 2898 Ad
kalki 2898 ad : కల్కి కథ చెప్పేసిన నాగ్ అశ్విన్
మరో వారంలో కల్కి సినిమా జనం ముందుకు రానుండటంతో దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఓ మూడు ప్రపంచాల మధ్య నడిచే కథ కల్కి అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పారు.ఈ కథ గురించి ఇంకా ఆయన ఏం చెప్పారంటే..?
kalki 2898 ad : విడుదల కాక ముందే కల్కి 2898 ఏడీ మూవీ ఎంతో క్రేజ్‌ని సంపాదించుకుంది. ప్రభాస్ (Prabhas )హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వైరల్ అవుతోంది. అంటే ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతోంది. ఈనెల 27న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) ఈసినిమా కథను టూకీగా చెప్పే ప్రయత్నం చేశారు. మూడు ప్రపంచాల మధ్య జరిగే కథే కల్కి(kalki) అని చెప్పుకొచ్చారు.
కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే మూడింటి మధ్యలోనే ఈ కథ తిరుగుతుంది. గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి లేదా కాశీ ఈ మూడు ప్రపంచాల్లో ఒకటి. దీన్ని ప్రపంచంలోనే మొదటి నగరమని చెబుతారు. శాసనాల్లో, పుస్తకాల్లోనూ ఈ విషయం ఉంది. అలాంటి కాశీయే ప్రపంచంలో చివరి నగరం అయితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచే ఈ కథ పుట్టిందని నాగ్(Nag Ashwin) చెప్పుకొచ్చారు.
కాశీలో జీవ నది అయిన గంగ ఉన్నట్లుండి ఎండిపోతుంది. దీంతో ప్రజలకు కష్టాలు మొదలవుతాయి. దుర్భర జీవితాన్ని గడపడం ప్రారంభిస్తారు. మరో ప్రపంచం అయిన కాంప్లెక్స్ ఓ స్వర్గం లాంటిది. అది ఆకాశంలో కిలోమీటరు మేర విస్తరించి ఉంటుంది. దానిలో దొరకని పదార్థం, వస్తువు ఏదీ ఉండదు. పచ్చని ప్రకృతి, నీరు, ఆహారం లాంటివన్నీ సమృద్ధిగా ఉంటాయక్కడ. దుర్భర జీవితాన్ని గడుపుతున్న కాశీ ప్రజలు కాంప్లెక్స్‌కి వెళ్లి అక్కడ సౌకర్యాలను అన్నీ అనుభవించాలని అనుకుంటారు. ప్రపంచంలో మరెక్కడా లేనివి కాంప్లెక్స్‌లో ఉండటంతో వాటిని కాశీ ప్రజలకు అందకుండా కొందరు కంట్రోల్ చేస్తుంటారు. అక్కడికి అడుగు పెట్టాలంటే ప్రాణాల్ని పణంగా పెట్టాల్సిందే. ఈ రెండు ప్రపంచాలు కాకుండా ఉన్న మరో ప్రపంచమే శంబల. దీన్నే షాంగ్రిలా అని కూడా అంటారు. అక్కడి నుంచే విష్ణువు చివరి అవతారం అయిన కల్కి కూడా వస్తుంది. ఈ మూడు ప్రపంచాలను ముడి పెడుతూ కల్కి సినిమా నడుస్తుంది.