ROAD ACCIDENT : ఓటేసేందుకు స్వస్థలాలకు వచ్చి మూడు రోజుల పాటు అంతా ఆనందంగా గడిపారు. తిరిగి హైదరాబాద్కి బస్సులో బయలుదేరారు. మార్గ మధ్యంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అగ్ని కీలల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున 1:30 ప్రాంతంలో పల్నాడు(PALNADU) జిల్లాలో జరిగింది.
మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చినగంజాం, పర్చూరు, చిలకలూరి పేట మీదుగా హైదరాబాద్ పయనమైంది. ఈ బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. చినగంజాం, నీలాయపాలెం, గొనసపూడి ఊర్లకు చెందిన వారే ఈ బస్సులో అధికంగా ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బస్సు చిలకలూరి పేట మండలం అన్నంబట్లపాలెం, పసుమర్రు ఊళ్ల మధ్యలో ఉంది. ఆ సమయంలో అత్యంత వేగంగా టిప్పర్ వచ్చి బస్సును(BUS) ఢీకొట్టింది.
రెండు వాహనాలు ఢీకొన్న వెంటనే అక్కడ పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసి పడ్డాయి. బస్సులోకి సైతం మంటలు వ్యాపించాయి. దీంతో నిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో అర్థమయ్యే లోపే మంటలు బస్సంతా(BUS) వ్యాపించాయి. దీంతో ఆరుగురు మరణించారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. మరో 20 మందికి కాలిన గాయాలయ్యాయి. వారందరినీ చికిత్స కోసం చిలకలూరి పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక దళాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశాయి.