»30 Years After Daughters Death Family Places Matrimonial Ad For Ghost Groom
Marriage :‘చనిపోయిన అమ్మాయికి, చనిపోయిన వరుడు కావలెను’ అంటూ ప్రకటన!
పెళ్లీడుకొచ్చిన పిల్లకి చక్కని వరుడు కావలెను అంటూ ప్రకటనలను మనం చూసే ఉంటాం. అయితే కర్ణాటకలో మాత్రం 30 ఏళ్ల క్రితం చనిపోయిన తన కూతురికి వరుడు కావాలంటూ ఓ కుటుంబం వారు పత్రికలో ప్రకటన వేశారు. ఎందుకంటే?
Marriage Of Ghosts : ‘30 ఏళ్ల క్రితం చనిపోయిన మా అమ్మాయికి, అంతకంటే ముందు చనిపోయిన అబ్బాయి వరుడుగా కావలెను’ అంటూ కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం పత్రికలో యాడ్ వేయించింది. అది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. కొంత మంది మాత్రం ఇది సాధారణ విషయమే అన్నట్లు చదివేశారు. మరి కొందరేమో తమ చనిపోయిన అబ్బాయి తాలూకు వివరాలతో ఆ కుటుంబాన్ని సంప్రదించారు. ఏంటీ గందరగోళం అనుకుంటున్నారా? పూర్తిగా చదివేస్తే మీకే అర్థం అవుతుంది.
తుళు కమ్యునిటీలోని ప్రజలు పెళ్లి(marriage)కాని అమ్మాయిలు చనిపోతే వారు ఆత్మలుగా అలాగే సంచరిస్తారని నమ్ముతారు. వారికి విముక్తి కలిగించేందుకు అదే వయసులో ఉన్న చనిపోయిన అబ్బాయితో పెళ్లి చేస్తారు. అంటే ఇది ఆత్మల పెళ్లి అన్నమాట. తమ కూతురు ఎన్నేళ్ల క్రితం చనిపోయినా సరే.. పెళ్లీడుకు రాగానే ఈ తంతు జరిపిస్తారు. అయితే ఈ ఆత్మల పెళ్లికి కూడా కులం, గోత్రం లాంటి వాటన్నింటినీ సరిచూసి అప్పుడు వారికి పెళ్లి చేస్తారు. అలా చేయకపోతే వారు చాలా బాధ పడతారట. ఈ తంతునే వారు ‘ప్రేత మధువే’( Pretha Maduve) పేరుతో పిలుస్తారు. ఇదేదో ఆషామాషీగా జరిగే వివాహం కాదండి. మామూలు పెళ్లిలాగే ఎంతో ఆడంబరంగా దీన్ని జరిపిస్తారు. బంధువుల్ని పిలుస్తారు. వచ్చిన వారికి చక్కటి భోజనాలు పెడతారు. ఈ ప్రేత వివాహాలు అక్కడ ఎక్కువగా ఆషాఢ మాసంలో జరుగుతూ ఉంటాయిట.
అందుకనే సదరు కుటుంబం అలా పత్రికలో మేట్రిమోనియల్ యాడ్( Matrimonial Ad) ఇచ్చిందట. దీంతో తమ చనిపోయిన వరులు ఉన్నారంటూ 50 మంది వరకు తల్లిదండ్రులు వారిని ఎంక్వైరీ చేయడానికి ఫోన్లు చేశారట. ఈ ఆచారం ఉన్న ప్రజలు ఎక్కువగా కర్ణాటకలోని తీర ప్రాంతాలు, దక్షిణ కన్నడ, ఉడిపిల్లో కనిపిస్తుంటారు. ఏదేమైనా ఇదేదో వింత ఆచారంలాగే అనిపిస్తుంది కదూ!