protein powders : చాలా మంది శరీర దారుఢ్యం కోసం, కండలు పెంచడం కోసం ప్రొటీన్ పౌడర్లను ఎక్కువగా వాడుతుంటారు. ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో పాటుగా ప్రొటీన్ సప్లిమెంట్లను(Protein supplements) తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా పౌడర్లు, సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ప్రమాదాలు పొంచి ఉంటాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) వెల్లడించింది. ఇవి ఎంత మాత్రమూ సూచనీయం కాదని తెలిపింది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల యాడెడ్ షుగర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లను(artificial flavours) లోపలికి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది.
ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు ఖనిజాలను నష్టపోతాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. మొత్తం శరీర ఆరోగ్యంపై ఇవి దుష్ప్రభావాన్ని చూపిస్తాయని తెలిపింది. ప్రొటీన్ పౌడర్ డబ్బాలపై ఉండే లేబుళ్లను చదివి వాటిని వినియోగించడం సరికాదని హెచ్చరించింది. చక్కెరల ద్వారా ఎక్కువ శక్తిని పొందడం తగ్గించుకోవాలని సూచించింది. తృణ ధాన్యాలు, పప్పులు, గుడ్లు, డైరీ ఉత్పత్తులు, సోయాబీన్స్, పీస్ లాంటి వాటిని తీసుకుని ప్రొటీన్ అవసరాలను తీర్చుకోవాలని తెలిపింది.
ప్రొటీన్ పౌడర్లు (protein powders) ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? అనే విషయంపై ఐసీఎంఆర్(ICMR ) చేసిన స్టడీల ఆధారంగా ఈ విషయాలనను వెల్లడించింది. యాడెడ్ షుగర్స్ ఉండే ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల టైప్ 2 డయాబెటీస్ లాంటివి వచ్చే అవకాశాలుంటాయని తెలిపింది. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ ఇవి రెండూ ఉన్నప్పుడు బీపీ, గుండె జబ్బులు, డయాబెటీస్ లాంటివి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పేర్కొంది.