ఈ సంవత్సరంలో రెండో బీ-టౌన్ పెళ్లిని చూసేందుకు సిద్ధంగా ఉండండి! ఫిబ్రవరి రెండో వారంలో మరో బాలీవుడ్ జంట పెళ్లిపీటలు ఎక్కనుంది. ఇప్పుడు మాట్లాడుతున్నది షేర్షా జంట గురించే. ఎన్నాళ్ల నుండో ప్రేమలో తేలియాడుతున్న జంటలు కొన్ని ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటాయని అభిమానులు భావిస్తున్నారు. అలాంటి జంటల్లో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఉన్నారు. మరో ప్రేమజంట అతియా శెట్టి, కేఎల్ రాహుల్ గత నెలలో ఒక్కటయ్యారు. ఇప్పుడు కియారా-సిద్ధార్థలు ఒక్కటవుతున్నారని బాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పెళ్లికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. పెళ్లి గురించి ఇప్పటి వరకు స్పందించని వీరు… ఆ పనుల్లో మాత్రం నిమగ్నమైపోయారట. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఫిబ్రవరి 4, 5 తేదీల్లో హల్దీ, సంగీత్ దుబాయ్లో ఉంటుంది. ఆరో తేదీన వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి.
ఈ వివాహ వేడుక అంతా కేవలం దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్య జరగనుందట. ముంబైలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని చెబుతున్నారు. పెళ్లి వేడుకను డాక్యుమెంటరీగా రూపొందించే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే పెళ్లి కోసం ఫ్యామిలీ ఫ్రెండ్స్, దగ్గరి స్నేహితులు షాపింగ్ దాదాపు పూర్తి చేశారట. దుబాయ్లో సంగీత్, హల్దీ ఫంక్షన్ గురించి కియారా తన స్నేహితులతో చర్చించారట. అతిథుల కోసం రెండు రోజుల ముందు విమానాలు ప్రారంభిస్తున్నారట. అంతేకాదు, విలాసవంతమైన విల్లాలో ఏర్పాట్లు చేస్తున్నారట. అతిథులకు ఏ కొరత రాకుండా అన్నీ సిద్ధం చేస్తున్నారట. 2021లో వీరిద్దరికి షేర్షా సినిమా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి మధ్య బ్రేకప్ వార్తలు కూడా వచ్చాయి. వేటి పైనా స్పందించలేదు. ఎట్టకేలకు ఈ ప్రేమజంట ఇప్పుడు ఒక్కటవుతోందంటున్న బాలీవుడ్ వర్గాల టాక్ రేపో.. ఎల్లుండో తేలిపోనుంది.