Rahul Gandhi Assets : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(RAHUL GANDHI) ఆస్తుల విలువ రూ.20.25 కోట్లుగా ఉంది. లోక్ సభ ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఈ ఆస్తుల వివరాలను భారత ఎన్నికల సంఘానికి వెల్లడించారు. వ్యవసాయ భూమి, వాణిజ్య భవనాలు సహా స్థిరాస్తుల విలువ రూ.11 కోట్లు ఉందని తెలిపారు. అలాగే చరాస్తుల విలువ రూ.9.25 కోట్లు ఉంటుందని తెలిపారు.
రాహుల్ 2019 ఎన్నికల్లో తన ఆస్తుల విలువ(ASSETS VALUE) రూ.14 కోట్లుగా ఉందని అఫిడ్‌విట్‌లో తెలిపారు. ఆ లెక్కను బట్టి చూసుకున్నట్లయితే గత ఐదేళ్లలో రాహుల్ గాంధీ ఆస్తుల విలువ 28 శాతం మేర పెరిగింది. ఆయన సిట్టింగ్ స్థానం వయనాడ్ నుంచి ఇప్పుడు కూడా బరిలోకి దిగుతున్నారు. అందుకు సంబంధించిన నామినేషన్‌ను బుధవారం ఆయన సమర్పించారు.
అఫిడవిట్లో రాహుల్(RAHUL) నమోదు చేసిన వివరాల ప్రకారం… ఆయన పేరు మీద రెండు కార్యాలయ స్థలాలు ఉన్నాయి. ఒకటి హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉండగా మరొకటి సిలోఖేరాలో ఉన్న సిగ్నేచర్ టవర్స్‌లో ఉంది. వీటిని రూ.7 కోట్ల, రూ. 93 లక్షల ధరతో కొనుగోలు చేయగా, ప్రస్తుతం ఈ స్థలాల ధర రూ.9 కోట్ల వరకు ఉంది. 2022 – 2023 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన మొత్తం ఆదాయం రూ.1,02,78,680గా ఉంది. 2021 – 22 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం 1,31,04,970గా ఉంది. అద్దెలు, ఎంపీగా వేతనం, బ్యాంకు వడ్డీలు, డివిడెంట్లు, మ్యూచువల్ ఫండ్లు, షేర్లు తదితరాల నుంచి ఈ ఆదాయం వస్తున్నట్లు తెలిపారు.