FRIDGE WATER : వేసవిలో ఫ్రిజ్ నీళ్లు తాగితే ఏం అవుతుందో తెలుసా?
వేడి వేడిగా ఉండే వేసవి కాలంలో చల్లచల్లగా ఫ్రిజ్లో నీళ్లు తాగడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. మరి ఇంత చల్లటి నీటిని తాగితే ఏమౌతుందో ముందు తెలుసుకోవడం మంచిది.
HEALTH PROBLEMS WITH FRIDGE WATER : వేసవి కాలంలో సాధారణ నీటిని తాగేందుకు చాలా మంది ఇష్ట పడరు. బయట వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కూలింగ్ వాటార్ తాగడానికే అంతా ఆసక్తి చూపిస్తుంటారు. అలా చల్లటి నీటిని తాగడం వల్ల ఒక్కసారిగా పొట్ట ప్రశాంతంగా అనిపిస్తుంది. శరీరం అంతా వేడి పోయి చల్లగా మారిపోయిన అనుభూతి కలుగుతుంది. కానీ వాస్తవంగా శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
అతి చల్లగా ఉండే నీరు(chilled water) మన పొట్ట, శరీరం, గొంతు లాంటి వాటి మీద చాలా ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గొంతు నొప్పి, జలుబు, దగ్గులాంటి అనారోగ్యాలు తలెత్తవచ్చు. అలాగే ఇలా వేడి ఉష్ణోగ్రతలో అతి చల్లని నీటిని తాగడం వల్ల శరీరం ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసుకోలేదు. దీంతో వడదెబ్బ తగిలే ప్రమాదమూ ఉంటుంది.
అతి ఎండలో తిరిగి వచ్చి ఒక్కసారిగా అతి చల్లటి నీటిని తాగడం వల్ల రెండు ఉష్ణోగ్రతల మధ్య చాలా వ్యత్యాసం ఏర్పడుతుంది. అందువల్ల ఆ ప్రభావం రక్త నాళాలు, గుండెపై పడుతుంది. అలాగే అతి చల్లటి నీటిని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా ఇబ్బంది పడుతుంది. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా మలబద్ధకం లాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఎక్కువ చల్లగా ఉండే ఫ్రిజ్ నీటికి(fridge water) బదులుగా తక్కువ చల్లగా ఉండే కుండ నీరు మంచివని నిపుణులు సలహా ఇస్తున్నారు.