Bhoothaddam Bhaskar Narayana: భూతద్దం భాస్కర్ నారాయణ ఎలా ఉందంటే?
డిటెక్టివ్ సినిమాలు ఎన్ని వచ్చినా చాలా ఆసక్తిగా చూస్తారు ప్రేక్షకులు. చంటబ్బాయ్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వరకూ ఎన్ని సినిమాలు వచ్చినా విజయాన్ని సాధించాయి. తాజాగా శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన చిత్రం భూతద్దం భాస్కర్ నారాయణ. పురాణ కథతో డిటెక్టివ్ కథని ముడిపెడుతూ తీసిన ఈ చిత్రం ఎంతవరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కర్ణాటక, ఆంధ్రా సరిహద్దుల్లో దిష్టి బొమ్మల హత్యలు పోలీసులకు సవాలుగా మారుతాయి. ఎంత ప్రయత్నించినా ఒక్క క్లూ కూడా లభించదు. 18 సంవత్సరాల కాలంలో 17 హత్యలు జరుగుతాయి. బాధితులందరూ మహిళలే. హత్య జరిగిన స్థలంలో మొండెం స్థలంలో దిష్టి బొమ్మను పెడుతారు. ఇది కచ్చితంగా ఓ సైకో కిల్లర్ హత్య అని అందరూ భావిస్తారు. పోలీసులు సైతం ఇదే అనుమానిస్తారు కానీ ఒక్క క్లూ కూడా ఉండదు. ఈ కేసును పరిష్కరించడం కోసం డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. ఎలాంటి ఆధారలు లేకుండా ఈకేసును సాల్వ్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. అతనికి చాలా సవాల్లు ఎదురౌతాయి. చివరికీ అవి సీరియల్ కిల్లర్ చేసే హత్యలు కాదు, నర బలులు అనే విషయాన్ని కనిపెడుతాడు. ఇంతకీ ఆ మహిళల్ని బలి ఇస్తున్నది ఎవరు? తల స్థానంలో దిష్టి బొమ్మలు ఎందుకు పెడుతున్నారు? ఈ కేసును భాస్కర్ నారాయణ ఎలా సాల్వ్ చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
డిటెక్టివ్ కథలంటే ఒక సమస్యను పరిష్కరించాలంటే కొన్ని సవాళ్లు ఉంటాయి. వాటిని ఒక్కోటికా అధిగమిస్తూ
సాల్వ్ చేస్తారు. ఇక ఈ సినిమాలో కూడా కేసును పరిశోధిస్తూ హీరో చేసే ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథ పురాణాలతో ముడిపెట్టిన తీరు మెప్పిస్తుంది. డిటెక్టివ్ భాస్కర్ నారాయణ ప్రపంచం కూడా గత చిత్రాలకి చాలా భిన్నంగా ఉంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. చిత్రంలో హీరో హీరోయిన్ల నడుమ వచ్చే సీన్లు సరదాగా ఉంటాయి. సీరియల్ కిల్లర్ కేస్ మొదలయ్యాకే అసలు కథ మొదలవుతుంది. హత్యలపై పోలీసుల పరిశోధన, ఆ కేసులోకి హీరో ప్రవేశం ఇలా ప్రథమార్థం చాలా ఆసక్తిగా సాగుతుంది. సెకండ్ ఆఫ్‌లో వచ్చే మలుపులు మరింత ఉత్కంఠని రేకెత్తిస్తాయి. ఈ కథలోని పురాణ నేపథ్యం సినిమాకి హైలైట్. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. ఓ మంచి కామెడీ థ్రిల్లర్‌ను చూసిన ఫీలింగ్ వస్తుంది.
ఎవరెలా చేశారంటే:
హీరోగా శివ కందుకూరి అల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఇందులో డిటెక్టివ్ పాత్రలో చాలా సహజంగా ఒదిగిపోయాడు. నటన పరంగా రెండు షేడ్స్ చూపించే క్యారెక్టర్. ఫస్ట్ ఆఫ్ అంతా సరదా సన్నివేశాల్లో కనిపించి, ఆ తరువాత సెకాండాఫ్‌లో సీరియస్ సన్నివేశాల్లో కనిపించాడు. మెప్పించాడు. హీరోయిన్ రాశిసింగ్ అందమైన రిపోర్టర్‌గా కనిపించింది. షఫి, దేవి ప్రసాద్, శివన్నారాయణ, శివకుమార్ తదితరులు వారి పాత్రల మేరకు అద్భుతంగా నటించారు.
సాంకేతిక అంశాలు:
సస్పెన్స్‌ను బిల్డ్ చేయడంలో డైరెక్టర్ పురుషోత్తమ్ రాజ్ విజయం సాధించాడు. సంగీతం బాగుంది. కెమెరా వర్క్ అద్భతంగా ఉంది. ఎడిటర్ తన పని చాలా బాగా చేశాడు. నేపథ్య సంగీతం ఈ సినిమా స్థాయిని పెంచింది. దర్శకుడిగా పురుషోత్తం రాజ్ నిజాయతీగా కథని చెప్పే ప్రయత్నం చేశాడు. నిర్మాణం పరంగా కూడా సినిమా చాలా బాగుంది.