»Sc Issues Contempt Notice To Patanjali Over Misleading Advertisements
Patanjali : పతంజలి మందుల ప్రచారాన్ని ఆపండి : బాబా రామ్‌దేవ్‌కు సుప్రీం ఆదేశాలు
యోగా గురు రామ్ దేవ్ బాబాకు సంబంధించిన పతంజలి ఆయుర్వేద సంస్థపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మందులు పలు జబ్బుల్ని తగ్గిస్తాయంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాటిని ఖాతరు చేయనందుకుగాను కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది.
Supreme Court On Patanjali Products : ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్( Ramdev) కు చెందిన ఆయుర్వేద సంస్థ పతంజలి నుంచి అమ్ముతున్న పలు ఆయుర్వేద మందుల ప్రచారాన్ని ఆపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మందులపై చేసిన ప్రచారం వల్ల దేశం మొత్తం మోస పోయిందని వ్యాఖ్యానించింది. ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఈ మందులపై ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదని తెలిపింది. అయినా ఈ ఆదేశాలను బేఖాతరు చేసినందుకు కోర్టు ధిక్కార నోటీసులు ఇచ్చింది.
అనేక రకాల జబ్బుల్ని తగ్గిస్తాయంటూ పతంజలి ఆయుర్వద సంస్థ తప్పుడు ప్రచారం చేస్తోందని దాన్ని కచ్చితంగా అడ్డుకోవాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఆ ప్రచారాలను నిలిపివేయాలని ఆదేశించింది. దీనికి సమాధానం దాఖలు చేయడానికి తమకు సమయం కావాలని పతంజలి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో కేసు తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం తెలిపింది.
కంపెనీ తయారు చేసిన ఆయుర్వేద మందులపై గత ఏడాది నవంబరు 21న జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం ప్రచారాలను ఆపివేయాలంటూ ఆదేశాలిచ్చింది. అయినా పట్టించుకోకుండా మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పతంజలి(Patanjali) సంస్థపై మండి పడింది. కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోరింది. ఇకనైనా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో తప్పుడు ప్రచారాలని నిలిపివేయాలని మళ్లీ ఆదేశాలిచ్చింది.