»Two Storms Attack On The Largest Planet Photos Released By Nasa
NASA: అతిపెద్ద గ్రహంపై రెండు తుఫానులు అటాక్.. ఫోటోలు రిలీజ్ చేసిన నాసా!
గురుగ్రహంపై రెండు భారీ తుఫాన్లు చెలరేగాయి. అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆ తుఫాన్లను నాసా ఫోటోలు తీసింది. వాటర్ కలర్ రంగులో రెండు తుఫాన్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గ్రహాల్లోనే అతి పెద్ద గ్రహం అయిన గురుగ్రహం (Jupiter)పై రెండు శక్తివంతమైన తుఫాన్లు (Cyclones) చెలరేగాయి. గురు గ్రహాన్ని బృహస్పతి అని కూడా అంటారు. ఈ గ్రహంపై తుఫాన్లు చెలరేగడాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ఫోటోలు తీసి విడుదల చేసింది. గురుడిపై ప్రస్తుతం వాతావరణం చాలా చల్లగా ఉందని, ఆ వాతావరణంలో సంభవించిన రెండు అతి పెద్ద శక్తివంతమైన తుఫాన్లు వాటర్ కలర్ పెయింటింగులను పోలి కనపడుతున్నాయని నాసా వెల్లడించింది.
నాసా (NASA) విడుదల చేసిన ఆ ఫోటోల్లో బృహస్పతిపై సంభవించిన తుఫాన్లు రంగురంగులుగా కనిపిస్తూ ఉన్నాయి. నాసా జునో మిషన్ లోని జునో క్యామ్ ఈ ఫోటోలను తీసింది. గతంలో కూడా గురు గ్రహానికి సంబంధించిన పలు ఫోటోలను నాసా విడుదల చేస్తూ వస్తోంది. ఇది వరకూ నవంబరు 29న, 2021లో కూడా పెరిజోన్ నుంచి నాసా ఫోటోలు తీసి విడుదల (Photos Release) చేసింది. 50 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద 6,140 కిలోమీటర్ల ఎత్తు నుంచి జునోక్యామ్ ఈ ఫోటోలను తీసినట్లుగా నాసా వెల్లడించింది.
భూమి పరిమాణం కంటే గురు గ్రహ పరిమాణం 1,303 రెట్లు ఎక్కువగా ఉండటంతో ఆ గ్రహంపై హైడ్రోజన్, హీలియం విపరీతంగా ఉంటుందని నాసా వెల్లడించింది. 2011లోనే నాసా గురు గ్రహంపై పరిశోధనలు చేయడానికి అట్లాస్ వీ 551 (ఏపీ 029) రాకెట్‌ను ప్రయోగించి విజయవంతమైంది. ఆ తర్వాత ఐదేళ్లకు 2016 జులై 5న వ్యామనౌక కూడా గురు గ్రహ ధ్రువ కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రస్తుతం గురు గ్రహానికి సంబంధించి నాసా విడుదల చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.