అతి వేగానికి నిండు ప్రాణం బలైంది. అతి వేగం ప్రమాదమని మొత్తుకుంటున్నా చాలా మంది అస్సలు వినడం లేదు. తాజాగా ఓ యూట్యూబర్(YouTuber) వీడియో కోసం అతి వేగంగా బైక్ నడిపి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అగస్టే చౌహాన్(Agaste Chouhaan) అనే వ్యక్తి ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో నివశిస్తున్నాడు. చౌహాన్ ప్రో రైడర్ 1000 అనే పేరుతో ఓ యూట్యూబ్ చానెల్ ను నడుపుతున్నాడు. తాజాగా సూపర్ బైక్ మీద యమునా ఎక్స్ప్రెస్ వేపై గంటకు 300 కిలోమీటర్లు వేగంగా దూసుకెళ్తానని తెలిపాడు.
తన వద్ద ఉన్న కవాసకి నింజా ZX10R 1,000cc బైక్ ను నడుపుతూ వీడియోలు చేయడం చౌహాన్ హాబి. ఈ క్రమంలో అతను ఆగ్రా నుంచి ఢిల్లీకి బైక్ పై బయల్దేరాడు. ఈ నేపథ్యంలో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది(Bike Accident). హెల్మెట్ పెట్టుకున్నా కూడా అతి వేగం వల్ల అది తునాతునకలైంది. దీంతో తలకు తీవ్ర గాయం అవ్వడంతో అగస్టే చౌహాన్(Agaste Chouhaan) మృతిచెందాడు.
అగస్టే చౌహాన్(Agaste Chouhaan) యూట్యూబ్ ఛానెల్(Youtube channel)కు దాదాపుగా 1.2 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. తన ఛానెల్ లో చివరగా ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. ఆ వీడియోలో తాను ఢిల్లీకి వెళ్తున్నానని, 300 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ వేగంగా బైక్ నడిపేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. చివరికి ఆ అతివేగం వల్లే ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం అతని ఫీట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.