Mumbai: ముంబైలో దివ్యాంగురాలైన ఓ వధువును మోయిస్తూ బిల్డింగ్ రెండో అంతస్తుకు రప్పించినందుకు వివాహ రిజిస్ట్రేషన్ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీల్ చైర్‌కు పరిమితమైన విరాలీ మోదీకి, క్షితిజ్ నాయక్‌తో ఈ నెల 16న పెళ్లి జరిగింది. ఆమె ముంబై ఖార్లోని వివాహ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లారు. వివాహ రిజిస్ట్రార్ కార్యాలయం రెండో అంతస్తులో ఉంది. పైకి లిఫ్ట్ లేదు. వధువు దివ్యాంగురాలు కావడంతో ఆమె సంతకాలు ఫార్మాలిటీస్ కోసం అధికారిని కిందకు రమ్మని వేడుకున్నారు. దీనికి ఆ అధికారి నిరాకరించడంతో చివరకు దివ్యాంగురాలైన వధువును రెండో అంతస్తు వరకు మోసుకెళ్లారు. ఇదే విషయాన్ని విరాలీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
రెండో అంతస్తుకు వెళ్లేందుకు ఎలాంటి లిఫ్ట్ లేదు. అలా అని ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి సంబంధిత అధికారి కిందకు దిగి రావడానికి నిరాకరించారు. ఇది న్యాయమా? యాక్సెసిబుల్ ఇండియా ప్రచారం ఏమైంది? వీల్‌చైర్ వినియోగించే దివ్యాంగురాలైన నేను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు లేదా? పెళ్లి రోజున రెండో అంతస్తు వరకు నన్ను మోసుకెళ్లినప్పుడు నేను లేదా మోసే వ్యక్తి జారిపడి ఏదైనా జరిగి ఉంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ఆమె ప్రశ్నించింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. వివాహ అధికారి అరుణ్ ఘోడేకర్ను సస్పెండ్ చేశారు. మహారాష్ట్ర రెవెన్యూ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.