ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కకు శ్రీమంతం చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్కకు శుభాకాంక్షలు చెబుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పెంపుడు జంతువులంటే అందరికీ ఇష్టం. చాలా మంది వాటిని కుటుంబ సభ్యుల్లాగానే చూస్తుంటారు. వాటికి బర్త్ డే వస్తే సెలబ్రేట్ చేస్తుంటారు. తాజాగా ఓ కుటుంబం కూడా తమ పెంపుడు కుక్కకి శ్రీమంతం చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోల్డెన్ రిట్రీవర్ డాగ్‌కి దాని యజమానులు శ్రీమంతం చేశారు. డాగ్ లవర్స్ ఎక్కువగా తమ పెంపుడు కుక్కను దత్తత తీసుకున్న రోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో వాటికి శ్రీమంతం చేయడం ఓ సాంప్రదాయంగా వస్తోంది.
కుక్కకు శ్రీమంతం చేసిన వీడియో ఇన్స్టాగ్రామ్ వేదికగా తెగ వైరల్ అవుతోంది. రోజీ, రెమో అనే రెండు కుక్కల యజమాని అయిన సిద్దార్థ్ శివమ్ ఆ వీడియోను షేర్ చేశారు. తమ పెంపుడు కుక్క రోజీకి శ్రీమంతం చేయడం ఆనందంగా ఉందన్నారు. రోజీ చాలా కూల్‌గా ఉంటుందని తన యజమాని చెప్పారు.
శ్రీమంతంలో భాగంగా రోజీపై ఎరుపురంగు చున్నీని కప్పి నుదుటన బొట్టు పెట్టి, కాళ్లకు గాజులు తొడగడం విశేషం. గులాబీ పూల రేకులు రోజీపై చల్లుతూ దానికి స్వీటు తినిపించారు. రోజీ పక్కన రెమో కూడా ఉండటమే కాకుండా ‘నేను సిద్ధంగా ఉన్నాను’ అనే బోర్డు కూడా ఉంది. ఈ వీడియోకు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందమైన వీడియో ఎప్పుడూ చూడలేదని, రోజీకి సాఫీగా ప్రసవం జరగాలని నెటిజన్లు కామెంట్స్ చేశారు.