»The State Government Is Good News For Golla And Kurmals
Telangana : గొల్ల, కుర్మలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
జూన్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణ(Telangana)లో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీకి రంగం సిద్ధమైంది. జూన్ 5వ తేది నుంచి రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించనున్నట్టు మంత్రి తలసాని (Minister Talasani) శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో తన శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. నల్గొండ(Nalgonda) లో ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అదే రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతులమీదుగా కార్యక్రమం మొదలవుతుందని ఆయన తెలిపారు. ‘‘సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ శుభవార్తను తెలియజేస్తున్నాం. మొదటి విడతలో 3.93 లక్షల మందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేశాం.
రెండో విడతలో 3.50 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తాం’’ అని తలసాని తెలిపారు. వచ్చే నెల 9న మృగశిర కార్తె (Mrigashira Karte) సందర్భంగా 8, 9, 10 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్(Fish Food Festival) ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా స్టాళ్లలో మత్స్య శాఖ(Department of Fisheries) ద్వారా శిక్షణ పొందిన మహిళలు తయారు చేసిన వివిధ రకాల చేపల వంటకాలను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. ఈ సమీక్షాసమావేశంలో గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా, డైరెక్టర్ డాక్టర్. ఎస్.రాంచందర్‌లు పాల్గొన్నారు.