తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇటీవల నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో ఉద్యోగార్థుల క్వాలిఫై మార్కులను తగ్గిస్తున్నట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు స్పష్టం చేసింది. 200 ప్రిలిమ్స్ మార్కుల పరీక్షలో ఓసీ అభ్యర్థులకు 30 శాతం, బీసీలకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక ఉద్యోగులకు 20 శాతం అర్హత మార్కులుగా కేటాయించారు. దీంతో ఓసీలకు 60, బీసీలకు 50, 40 మార్కులు వస్తే తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ కు క్వాలిఫై అయినట్లే.
గతంలో అభ్యర్థులందరికీ 30 శాతం అర్హత మార్కులుగా కేటాయించిన నేపథ్యంలో క్వాలిఫై మార్కులు తగ్గించాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. ఈ అంశంపై సీఎం కేసీఆర్ సైతం స్పందించి రిజర్వేషన్ల వారీగా మార్కులు తగ్గించాలని ఆదేశించారు. దీంతో TSLPRB ఆదివారం అర్హత కట్ ఆఫ్ మార్కులు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఫలితాలకు అడ్డంకి తొలగినట్లైంది. ఇప్పటికే సెప్టెంబర్ చివరి నాటికి ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదల చేస్తామని పోలీస్ బోర్డు ప్రకటించింది. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు క్వాలిఫై మార్కులు తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు రావడంతో ఫలితాల విడుదల ఆలస్యమైంది. ప్రస్తుతం ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో త్వరలో ప్రిలిమ్స్ క్వాలిఫై అభ్యర్థుల తుది ఫలితాలు రిలీజ్ చేయనున్నారు.