»Rahul Is Visiting Three Constituencies In Telangana Today
Rahul Gandhi: నేడు తెలంగాణలోని మూడు నియోజకవర్గాల్లో రాహుల్ పర్యటన
నేడు తెలంగాణలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే. అయితే ఆమెకు అనారోగ్యం వల్ల తానే పర్యటిస్తున్నట్లు రాహుల్ తెలిపారు.
పాలమూరు ప్రజాభేరి సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమ ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రజా తెలంగాణ, దొరల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ను, కేంద్రంలో బీజేపీని ఓడిస్తామని రాహుల్ అన్నారు. నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కల్వకుర్తి సభలో, సాయంత్రం 6 గంటలకు జడ్చర్లలో రాహుల్ పాల్గొననున్నారు.
ప్రజా భేరి సభలో రాహుల్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు నిలిచిపోదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రియాంక అనారోగ్యం వల్ల తాను తెలంగాణ పర్యటనకు వచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి తెలంగాణలో పనిచేస్తున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అవి కుట్ర చేస్తున్నాయన్నారు.
సీఎం కేసీఆర్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు ఎందుకు జరగడం లేదని రాహుల్ ప్రశ్నించారు. దొరల తెలంగాణ కాదు, ప్రజలు కలగన్న తెలంగాణ సాకారం కానుందన్నారు. ధరణి పోర్టల్‌తో రైతులకు అన్యాయం జరుగుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాహుల్ పర్యటనతో కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో మరింత జోష్ రానుందని కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.