Rahul gandhi: తెలంగాణలో 20 లక్షల మంది రైతులు నష్టపోయారు
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం BRS, BJP, AIMIM కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కొల్లపూర్లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరీ కాంగ్రెస్ సభలో భాగంగా పేర్కొన్నారు. అంతేకాదు అధికార కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎంలు ఒకరికొకరు సాయం చేసుకుంటాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సాయం చేస్తోందన్నారు. అందుకే తనపై ఎలాంటి కేసు లేకుండా బీజేపీ సపోర్ట్ చేస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈ ఎన్నికలతోపాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీని ఓడిస్తామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పాలమూరు ప్రజాభేరీ సభలో భాగంగా రాహుల్ పేర్కొన్నారు. అయితే తన సోదరి ప్రియాంక గాంధీ అనారోగ్యంగా ఉన్న దృష్ట్యా ఈ సభకు తాను వచ్చినట్లు చెప్పారు.
#WATCH | Telangana elections | In Kollapur, Congress MP Rahul Gandhi says, “Here, the contest is between BRS and Congress. BRS, BJP and AIMIM are working together. Your CM helps the BJP in Lok Sabha. Your CM fully supported GST and Farm Laws. All the CMs of the Opposition have… pic.twitter.com/ego5exjtSl
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీజేపీ-బీఆర్ఎస్ ద్వయం ప్రజల నుంచి రూ.లక్ష కోట్లు దోచుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒకవైపు మీ సీఎం, ఆయన కుటుంబం లబ్దిపొందగా.. మరోవైపు తెలంగాణ ప్రజలు, తల్లులు, అక్కాచెల్లెళ్లు, నిరుద్యోగ యువత బలి అయ్యారని వ్యాఖ్యానించారు. ఇటివల మేడిగడ్డ విషయంలోనే కేసీఆర్ కలల ప్రాజెక్టు బాగోతం బయటపడిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు..రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన అనేక ప్రాజెక్టులను ఓసారి పోల్చి చూడాలని రాహుల్ ప్రజలను కోరారు.
అయితే ఈ ఎన్నికలు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ‘దొరల’ ప్రభుత్వానికి..ప్రజల ప్రభుత్వానికి పోటీ అని కాంగ్రెస్ అధినేత అభివర్ణించారు. భూముల కంప్యూటరీకరణ సాకుతో ధరణి పోర్టల్ పెట్టి అనేక చోట్ల భూములు దోచుకున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో తెలంగాణలో 20 లక్షల మంది రైతులు నష్టపోయారని అన్నాపు. ఈ పోర్టల్ వల్ల ఎవరు ప్రయోజనం పొందారని ప్రశ్నించారు. కేవలం ఒక్క కేసీఆర్ కుటుంబం, వారి ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రమే లబ్ధి పొందారని విమర్శించారు. ఈ క్రమంలో తెలంగాణలో పోటీ BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. మీరు AIMIM, BJP లకు ఓటు వేస్తే మీ ఓటు వృథా అవుతుందని రాహుల్ అన్నారు.
గతేడాది వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లింది. నివేదికల ప్రకారం మేడ్డిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీ పరిధిలోని బ్యారేజీలలో ఒకటి దెబ్బతిన్నది. తెలంగాణ ముఖ్యమంత్రి జూన్ 2019లో భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-దశల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌గా బిల్ చేయబడింది. అయితే ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి ఇది వివాదాల్లో ఉంటుంది. ఇటివల మేడిగడ్డ డ్యాం కుంగిందనే వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి.