పెండ్లి.. జీవితాంతం గుర్తుండిపోయే తీయని వేడుక. ఆ సంబురానికి సంబంధించిన జ్ఞాపకాలు భద్రంగా ఉండాలి కదా! అందుకో మార్గం ఉంది.. ఫొటోషూట్. అయితే.. ఈ మధ్య ఫొటోషూట్ల ట్రెండ్ మారింది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ (Pre wedding shoot), కపుల్ షూట్ తప్పనిసరి అయిపోయాయి. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆన్ డ్యూటీలో పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు ఎస్సై దంపతులు. పంజాగుట్ట (Panjagutta) పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. పోలీస్ వాహనంతో.. అదీ విధి నిర్వహణలో ఉండగానే ఇద్దరు పోలీస్ అధికారులు షూట్లో పాల్గొన్నారు.
దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. ఎస్సై భావన (SI bhavana)తో ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ పెళ్లి ఆగష్టు 26వ తేదీన జరిగింది. అయితే.. వివాహానికి ముందు ఈ జంట వెడ్డింగ్ షూట్ నిర్వహించింది. రకరకాల లొకేషన్లో (location) షూట్లో పాల్గొంది ఆ టైంలో ఆ కాబోయే జంట. అంత వరకు పర్వాలేదు.అయితే షూట్ ఆరంభంలోనే.. మూడు సింహాలను చూపించి, ఇద్దరూ సినిమా లెవల్లో వాహనాల నుంచి కిందకు దిగి.. పోలీస్ స్టేషన్ బయట షూట్లో పాల్గొన్నారు. దీంతో యూనిఫాం(Uniform)లో అదీ పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంపై విమర్శలు మొదలయ్యాయి. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. దీనిపై ఉన్నతాధికారుల స్పందన తెలియాల్సి ఉంది.