MBNR: ఎన్నికల కోడ్‌ను జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ డి.జానకి ఇవాళ వెల్లడించారు. ఎన్నికల సంఘం సూచనలు, నిబంధనల మేరకు వ్యవహరించాలని, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించవద్దని, అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసు నిఘా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినా, ఇతరుల మనోభావాలను కించపరిచేలా పోస్ట్‌లు పెట్టినా కఠిన చర్యలు తప్పవన్నారు.
NLG: ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. డా. బీ.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వరదల వల్ల దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ చర్యలపై మంత్రి గురువారం అధికారులతో విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. హ్యామ్ మోడల్ రోడ్ల నిర్మాణం, నాణ్యతా ప్రమాణాలు తదితర అంశాలపై మంత్రి అధికారులతో సమగ్రంగా చర్చించారు.
MDCL: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆర్టీసీ భవన్ ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మేకల కావ్యను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. పోలీసు నిర్బంధాలను, ప్రభుత్వ తీరును ఆమె వ్యతిరేకించారు.
KMM: మధిర టౌన్ పోలీస్ స్టేషన్‌లో రవీందర్ రెడ్డి గత కొంతకాలంగా హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఏఎస్సైగా ప్రమోషన్ పొందారు. గురువారం మర్యాదపూర్వకంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజంను ఏఎస్సై రవీందర్ రెడ్డి కలిసి పూల మొక్కను అందజేశారు. మధిర పోలీస్ స్టేషన్ SHO, సీఐ రమేష్, రూరల్ సీఐ మధు, పోలీస్ సిబ్బంది రవీందర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.
WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలో గురువారం వైద్యాధికారి డాక్టర్ సరోజన ఆధ్వర్యంలో కుక్క, కోతి కాటుపై వైద్య శిబిరం నిర్వహించారు. కుక్క, కోతి కాటు జరిగితే గాయాన్ని సబ్బుతో 15-20 నిమిషాలు కడగాలని, రేబిస్ మరణాల నివారణకు యాంటీ-రేబిస్ టీకా తక్షణం తీసుకోవాలని డాక్టర్ సరోజన సూచించారు. ఈ శిబిరంలో వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
NLG: కట్టంగూరు మండలంలోని ఒక జడ్పీటీసీ, 13 ఎంపీటీసీ స్థానాల కోసం నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని MPDO జ్ఞాన ప్రకాష్ రావు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు MPDO కార్యాలయం మీటింగ్ హాల్లో నామినేషన్లు అందజేయాలని పేర్కొన్నారు.
MBNR: మిడ్జిల్ మండలం కేంద్రంలో గత రెండు నెలల నుంచి రోడ్లపై మురుగు పారుతూనే ఉంది. ఈ మురుగు పారుతుండడం వలన దోమల బెడద ఎక్కువై టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలు వస్తున్నాయి. అలాగే, కొత్తూరు గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గాన వాహన దారులు కిందపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉన్నత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
WGL: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. ZPTC, MPTC ఎన్నికలు ఈ నెల 23, 27 తేదీల్లో, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నవంబర్ 4, 8 తేదీల్లో జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని 317 గ్రామ పంచాయతీల్లో 2,754 వార్డులకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.
NZB: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడి బాధాకరమని తెలంగాణ రచయితల వేదిక నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బానోత్ ప్రేమ్ లాల్ అన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు. ఈ దాడి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
SDPT: రేవంత్ రెడ్డి ఆర్టీసీని అమ్మేలా ప్రైవేటీకరణకు కుట్ర చేస్తున్నారని సిద్దిపేట మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. హైదరాబాద్‌లో కమీషన్ల కోసం ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు పెద్ద కాంట్రాక్టర్లకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఉప్పల్, మియాపూర్ వర్క్ షాపులు, జూబ్లీ బస్ స్టాండ్‌తో పాటు అనేక ఆస్తులను అమ్మేసి రూ.1500 కోట్లు అప్పు తెచ్చారన్నారు.
NGKL: మన్ననూర్ గ్రామ అంబేద్కర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దాసరి వెంకటనారాయణ ఇవాళ రూ.1.50 లక్షలు విరాళంగా అందించారు. 1964 నుంచి 1971 వరకు తాను చదివిన ఆయన ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థుల కోసం ఆయన డ్యూయల్ డెస్క్ బెంచీలు, ఆట వస్తువులను బహూకరించారు
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తామని ఎస్పీ జానకి అన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో నిరంతరం పోలీస్ తనిఖీలు ఉంటాయన్నారు. నిషేధిత వస్తువుల రవాణాపై నిఘా ఉంచామని వెల్లడించారు.
MNCL: బెల్లంపల్లి పట్టణం రడగంబాల బస్తీకి చెందిన న్యాయవాది షేక్ అఫ్జల్ (34) బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతు గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. షేక్ అఫ్జల్ ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడన్నారు.
HYD: బీఆర్ఎస్ ఛలో బస్ భవన్ పిలుపు మేరకు సిటీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెహదీపట్నం నుంచి బస్ భవన్‌కు హరీశ్ రావు బస్సులో బయల్దేరారు. రేతిఫైల్ నుంచి KTR ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వచ్చారు. పోలీసుల బందోబస్తు చూసి BRS నేతలు ఖంగుతిన్నారు. ఇంతకీ ఛలో బస్ భవన్ నేతలా? లేక పోలీసులా? పిలుపునిచ్చింది అంటూ SMలో ఫొటోస్ పెట్టి మరీ కామెంట్లు చేస్తున్నారు.
NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని 3 ప్రాంగణాల్లో విధులు నిర్వహిస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బోధన సిబ్బంది ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు, బోధనేతర సిబ్బంది సాయంత్రం 5 వరకు విధుల్లో ఉండాలని సూచించారు.