KMR: బాన్సువాడ పట్టణంలోని శ్రీ సరస్వతి దేవి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం పదొవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆయన సతీమణి సోనీ రెడ్డిలు సతి సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
GDWL: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి (NHPS) తరఫున పోటీ చేసేందుకు సిద్ధం కావాలని ఆ సంస్థ జిల్లా ఛైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ ధరూర్ మండల ముఖ్య నాయకులతో కలిసి బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు.
SRCL: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని సీనియర్ కాంగ్రెస్ నాయకులు భీమరాజ్ కనకరాజు అన్నారు. చందుర్తి మండలం రామన్నపేట ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం విజేతలకు, రన్నర్ విభాగంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కనకరాజు మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల పట్ల ఆసక్తి చూపాలన్నారు.
NLG: బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించడంపై మిర్యాలగూడ రజక సంఘం సంతోషం వ్యక్తం చేసింది. ఈ రిజర్వేషన్ల ద్వారా బీసీలకు ప్రాధాన్యత, అభివృద్ధి పెరుగుతాయని, సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు తగ్గి సమన్యాయం లభిస్తుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ జనాభా మేరకు అన్ని పార్టీలు రజకులకు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
MNCL: జన్నారం మండల కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో ఉన్న వివిధ వాహనాలకు అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పూజలు నిర్వహించారు. దసరా పండుగ నేపథ్యంలో బుధవారం అగ్నిమాపక కేంద్రంలోని ఫైర్ ఇంజన్ బైకులు, అగ్నిమాపక పరికరాలకు స్థానిక ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్‌తో పాటు సిబ్బంది హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం వాహనాలకు పూజలు చేయడం పరిపాటిగా వస్తుందన్నారు.
మేడ్చల్: ఉప్పల్ నియోజకవర్గ నాచారం మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవాలయంలో నూతనంగా ఎన్నికైన ఛైర్మన్, ధర్మకర్తలను ఘనంగా సన్మానించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ ఇంఛార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పాలక మండలి సభ్యులు దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ADB: గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామంలో బుధవారం దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆలయాన్ని సందర్శించి, పూజారులచే ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. నవరాత్రులు ఆధ్యాత్మికత, శక్తి, సమానత్వానికి ప్రతీకలని, ఇవి సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన గ్రామ ప్రజలతో అన్నారు.
NZB: మోపాల్ మండలంలోని 21 గ్రామపంచాయతీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు వివిధ పార్టీలకు చెందిన వాల్ పోస్టర్స్, వాల్ పెయింటింగ్స్, పోస్టర్స్‌ను తొలగిస్తున్నారు. అలాగే రూ. 50వేలకు మించి డబ్బు వెంటబెట్టుకొని ప్రయాణం చేయరాదని గ్రామప్రజలకు అధికారులు తెలియజేస్తున్నారు.
MNCL: బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో సరిపడా సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తూ HMS యూనియన్ ఏరియా వైస్ ప్రసిడెంట్ రాజాబాబు ఆధ్వర్యంలో ఆసుపత్రి వైద్యాధికారికి బుధవారం వినతిపత్రం అందజేశారు. గెలిచి 2 ఏళ్ళు దగ్గరికి వస్తున్నా AITUC నాయకులు ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఆసుపత్రి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
SRPT: మంత్రి ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి సంవత్సరీకం బుధవారం తిరుమలగిరి మండలం తాటిపాములలో జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఎమ్మెల్యే సామేలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు, మంత్రి కుటుంబాన్ని పరామర్శించారు.
KMR: లింగంపేట్ మండలం శెట్‌పల్లిలోని పల్లె దవాఖానాలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏఎన్ఎం రాధిక ఆధ్వర్యంలో బుధవారం మహిళలకు, ప్రజలకు వైద్యసేవలు అందించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో ఆశా సిద్ధేశ్వరీ, వైద్యులు పాల్గొన్నారు.
HYD: నగరంలో ఈ సారి గత 20 ఏళ్లలో లేని విధంగా అత్యధిక వర్షపాతం నమోదు చేసుకుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 897 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణం కంటే 43.7 శాతం ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిశాయి. కాగా, తెలంగాణ మొత్తం 988.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. ఈ వివరాలను తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది.
BDK: గిరిజన ఆశ్రమ పాఠశాలలో, పోస్ట్ మెట్రిక్ కళాశాల వసతి గృహాలలో పని చేస్తున్న కార్మికుల జీతాల తగ్గింపుకి నిరసనగా గత 20 రోజులుగా ఇల్లందులో సమ్మె నిర్వహిస్తున్నారు. మంగళవారం DYFI జిల్లా కమిటీ తరఫున జిల్లా కార్యదర్శి కాళంగి హరికృష్ణ సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ.. కార్మికుల జీతాలను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
MDK: పాపన్నపేట మండలంలో BJP మండల శాఖ అధ్యక్షులు సంతోష్ చారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లా BJP అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు BJP అభ్యర్థులు పోటీ చేసి గెలవాలని పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధి మోదీ ప్రభుత్వ పథకాల వలననే సాధ్యమైందని తెలిపారు.
NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి 5,81,628 క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. డ్యామ్ అధికారులు 24 గేట్లను 15 అడుగులు, 2 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 531534 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 584.10 అడుగులకు చేరుకుంది.