must celebrate republic day: ts high court order to telangana government
రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు నిర్వహించాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. యావత్ దేశం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటుందని గుర్తుచేసింది. పరేడ్ తప్పనిసరిగా నిర్వహించాలని కోరింది. ఈ వేడుకకు ప్రజలను అనుమతించాలని తెలిపింది.
రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్నందున రాజ్ భవన్‌లోనే వేడుకలు నిర్వహించాలని లేఖ రాశామని అడ్వకేట్ జనరల్ హైకోర్టు ఎదుట వాదనలు వినిపించారు. అక్కడ జరిగే వేడుకలకు ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. వేడుకలకు చూసేందుకు ప్రజల కోసం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏజీ వాదనలను ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదు. రిపబ్లిక్ డేకు సంబంధించి ఈ నెల 19వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని తేల్చిచెప్పింది. పరేడ్‌తో కూడిన వేడులకు నిర్వహించాలని, ఎక్కడ నిర్వహిస్తారో మీరే నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
కరోనా వైరస్ ప్రభావం ఉంటే, కొవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారా అని అడిగింది. రిపబ్లిక్ డే అనేది జాతీయ పండగ అని గుర్తుచేసింది. దేశభక్తిని చాటిచెప్పే పండగను నిర్వహించాలని తేల్చిచెప్పింది. స్ఫూర్తి చాటేలా వేడుకలు జరపాలని, పరేడ్ కూడా నిర్వహించాలని చెప్పింది.