తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడంతో కేసీఆర్ పతనం ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని చెప్పి, ఆ మాటే మరిచారని ధ్వజమెత్తారు. జనాలకు కబుర్లు చెప్పి అధికారం చేపట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండబోదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్నే చక్కదిద్దలేని కేసీఆర్ దేశాన్ని వెలగబెడతారా అని సెటైర్లు వేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం అంటే అమ్మకు తిండి పెట్టలేనోడు, పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అన్నట్టు ఉందన్నారు.
సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పారన్నారు. ఎస్సీలకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి చీట్ చేశారన్నారు. రుణమాఫీ కాకపోవడంతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ కింద ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని మోసం చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు/ కార్యకర్తలకే దళితబంధు ఇస్తున్నారని గుర్తుచేశారు. మరి మిగతావారి సంగతేంటని నిలదీశారు.
కేసీఆర్ చాంబర్లో ఒక్క దళిత అధికారి లేరని ఈటల రాజేందర్ అన్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ రాణి కుముదికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ‘దళితులకు ఉన్నత పదవీ ఇవ్వరా? బీహర్ క్యాడర్ అధికారులకే హైయర్ క్యాడర్ పోస్టులు ఇస్తారా? తెలంగాణకు చెందిన ఎస్సీ అధికారులకు ఎందుకు స్థానం కల్పించరు’ అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.