హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. ఏటీఎం నుంచి ఎలాగైతే డబ్బులు తీసుకుంటామో.. ఈ గోల్డ్ ఏటీఎం నుంచి అలాగే బంగారం, వెండి కాయిన్స్ తీసుకోవచ్చు.
Gold ATM: నగదు ఏటీఎంలు, డిపాజిట్ మిషన్లలో నగదును జమ చేయడం చూశాం. తాజాగా హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. ఏటీఎం నుంచి ఎలాగైతే డబ్బులు తీసుకుంటామో.. ఈ గోల్డ్ ఏటీఎం నుంచి అలాగే బంగారం, వెండి కాయిన్స్ తీసుకోవచ్చు. డెబిట్ కార్టు, క్రెడిట్ కార్డు లేదా యూపీఐ పేమెంట్ చేసి బంగారం, వెండి కాయిన్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ గోల్డ్ ఏటీఎంను గోల్డ్ సిక్కా సంస్థ అధ్వర్యంలో అమీర్‌పేట్ మెట్రోస్టేషన్ పరిధిలో ఏర్పాటు చేశారు.
గతేడాది డిసెంబర్లో బేగంపేటలో గోల్డ్ ఏటీఎంను ప్రారంభించారు. అయితే గతంలో కేవలం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఏటీఎం నుంచి నాణేలను డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఈ కొత్త వెర్షన్-2లో యూపీఐ విధానంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు చెల్లించి బంగారం, వెండి నాణేలను పొందవచ్చు. 99.99% నాణ్యత గ్యారెంటీ తెలిపే పత్రాలతో సహా 0.5, 1, 2, 5, 10, 20 గ్రాముల బంగారం, వెండి 10, 20, 50, 100 గ్రాముల నాణేలను డ్రా చేసుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా వీటి ధరలు ఉంటాయన్నారు. ఈ గోల్డ్ ఏటీఎం ఉదయం 9:50 నుంచి రాత్రి 11:30 వరకు తెరిచి ఉంటుంది.