కాంగ్రెస్ (Congress) తెలంగాణలో ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. కాగా నిన్న కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ రిలీజ్ కాగా టికెట్ రాని నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సెకండ్ లిస్టులో పేర్లు రాని నేతల నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యనేతలతో ఈ రోజు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. తమ భవిష్యత్ కార్యచరణపై సమాలోచనలు చేసి త్వరగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. బోధ్ టిక్కెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే బాపురావు (MLA Bapurao) స్వంత్రంతంగా పోటీ ఆలోచనలో ఉన్నారు.
జూబ్లీహిల్స్ లో విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy)కి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ఈ స్థానం నుంచి అజరుద్దీన్ కు సీటు కేటాయించింది. దీంతో విష్ణువర్ధన్ నేడు తన అనుచరులతో భేటీ కానున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీం పట్నం టికెట్ దక్కకపోవడంతో దండెం రాంరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మహేశ్వరం టికెట్ లక్ష్మారెడ్డికి ఇవ్వడంపై పారిజాత నర్సిహా రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ (Husnabad) కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ కారణంగా ముసలం స్టార్ట్ అయింది.మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో నేడు ఆయన ముఖ్య అనుచరులతో భేటీ కానున్నారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై చలమల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నేడు చౌటుప్పల్ లో అనుచరులతో కృష్ణారెడ్డి భేటీ కానున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఎల్లారెడ్డి టికెట్ ప్రకటనపై వడ్డేపల్లి అసంతృప్తిగా ఉన్నారు. నేడు కార్యకర్తలతో వడ్డేపల్లి సుభాష్ భేటీ కానున్నారు. కాంగ్రెస్ పార్టీకి సుభాష్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ రూరల్ టికెట్ భూపతిరెడ్డి కి ఇవ్వడంతో నగేష్ రెడ్డి అలకబూనారు. ఆకుల లలిత(Akula Lalitha)ను పార్టీలో చేర్చుకోవడంపై కూడా అసంతృప్తితో ఉన్నారు. దీంతో మూకుమ్మడి రాజీనామాలకు కాంగ్రెస్ కీలక నేతలు సిద్ధమవుతున్నారు.మహబూబ్ నగర్ జిల్లాలోను మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ టికెట్ ఆశించి భంగపడ్డారు. నేడు ఆయన కూడా అనుచరులతో భేటీ కానున్నారు. పటాన్ చెరు (Patan Cheru) కాటా శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ ఇస్తారా..? లేదా పార్టీలో చేరిన నీలం మధుకు అవకాశం ఇస్తారా..? అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.