CM Review On Dharani : ‘ధరణి’పై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు
సచివాలయంలో ధరణి పోర్టల్ పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఈ కీలక సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహ హాజరయ్యారు.
CM Review On Dharani : సచివాలయంలో ధరణి పోర్టల్ పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఈ కీలక సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహ హాజరయ్యారు. దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకోగా.. నెలకోసారి మండల కేంద్రంలో రెవెన్యూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ధరణి యాప్ భద్రతపై ఆరా తీశారు. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ధరణి లోపాలపై పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సీసీఎల్వో కమిషనర్ నవీన్ మిట్టల్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎన్నికల హామీలో భాగంగా ధరణి పోర్టల్‌ను రద్దు చేసి భూమాత పోర్టల్‌ను స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే ప్రకటించారు.
అనంతరం అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ డిజైన్ ఎవరు ఇచ్చారు? టెండర్ పిలిచారా? ఏ ప్రాతిపదికన వెబ్సైట్ రూపొందించే అవకాశం కల్పించారని అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 లక్షల 46 వేల 416 మందికి పాస్ పుస్తకాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. టీఎం33, టీఎం15కు చెందిన 2 లక్షల 31 వేల 424 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణిలో అనేక డేటా తప్పులు, పాస్ పుస్తకాల్లో తప్పులను సరిచేయాలన్నారు. అసలు ధరణికి చట్టబద్ధత ఏంటని అధికారులను ప్రశ్నించారు. సాదాసీదా పేర్లలో తప్పులు తొలగించాలి. కంప్యూటర్లనే నమ్ముకోవద్దు, జమా బంది రాయాలి, రికార్డులు రాయాలి అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరోవైపు ధరణిపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఫిర్యాదుల ప్రక్రియను సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మరోసారి సమావేశం నిర్వహిస్తామని సీఎం చెప్పారు.