పెళ్లికి సమయం ముంచుకొస్తుంది. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి.. పనులు వేగవంతం చేయాలని వరుడు కూడా ఓ చేయి వేశాడు. కుటుంబసభ్యులతో పాటు అతడు పనులు చేస్తున్నాడు. ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న ఆ యువకుడు కొద్దిసేపటికే కుటుంబాన్ని మొత్తం కన్నీటిలో ముంచి వెళ్లిపోయాడు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఆనందాలు సంతోషాలతో నిండాల్సిన ఆ ఇంట్లో గుండెశోకం మిగిలింది. ఈ సంఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఉట్నూరుకు చెందిన రావుల శంకరయ్య చారి, భూలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు సత్యనారాయణ చారి (34). జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన ఓ యువతితో ఈనెల 27న వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఇంటి వద్ద పెళ్లి పనులు జరుగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి వరకు కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి వరుడు సత్యనారాయణ పెళ్లి పనులు చేశాడు. ఆ సమయంలో ఒక్కసారిగా సత్యనారాయణ కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెంటనే ఆదిలాబాద్ లోని రిమ్స్ కు తరలించారు. సత్యనారాయణ చికిత్స పొందుతూ గురువారం ఆస్పత్రిలో ప్రాణం విడిచాడు. ఈ వార్త విన్న కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. పెళ్లి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. గుండెపోటు రావడంతో ఆ యువకుడు మరణించాడని వైద్యులు చెబుతున్నారు. చేతికొచ్చిన కొడుకు అకాల మరణంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.