తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు (Ration dealers) నిరసనకు దిగారు. డీలర్లు గౌరవ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రేషన్ షాపులు బంద్ చేసి ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించేవరుకు రేషన్ సరుకులు పంపిణిీ చేయబోమని ప్రకటించారు.హైదరాబాద్ (Hyderabad) జిల్లా ప్రధాన రేషన్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ (Civil Supply Officer) కు వినతి పత్రం అందజేశారు. పట్టణాల్లో రూ. 50 నుంచి రూ. 60 వేలు.. జిల్లాల్లో రూ. 30 నుంచి రూ 40 వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే క్వింటాలుకు రూ. 250 కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బయోమెట్రిక్ (Biometric) విధానంలో రేషన్ ఇవ్వాలని.. అమాలి ఫ్రీగా ఇవ్వాలని అన్నారు.
తమ డిమాండ్లు నెరవేర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపులను బంద్ చేసి.. సమ్మె చేస్తామని రేషన్ డీలర్ల జేఏసీ నాయకులు హెచ్చరించారు. దీని పై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) డీలర్లు మొండి వైఖరి సరికాదని హితవు పలికారు. నిరసన విరమించి విధుల్లో చేరకపోతే ఐకేపీ సెంటర్లు (IKP Centres) ద్వారా సరుకులు సరఫరా చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే మా డిమాండ్ ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపు నెరవేర్చాలని అన్నారు. రేషన్ డీలర్లు జీవనం కొనసాగించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రేషన్ బియ్యం అమ్మడం వల్ల అప్పుల పాలవుతున్నారని తమ సమస్యలను నెరవేర్చని పక్షాన రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెలు,ర్యాలీలు ఉద్రిక్తంగా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డీలర్లకు గౌరవ వేతనం ప్రకటించాలని, హమాలి చార్జీలు (Porter charges) ప్రభుత్వమే చెల్లించాలని, బియ్యం దిగుమతిలో సరైన తూకం ఇవ్వాలని ( గని బ్యాగ్స్ తో సహా) న్యాయమైన డిమాండ్లు నెరవేర్చలన్నారు.