టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అన్ని క్రికెట్ ఫార్మాట్లకు ఆయన గుడ్ బై చెప్పాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. దేశానికి, తన రాష్ట్రానికి ఇన్నేండ్ల పాటు ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉందన్నారు.
తన సామర్థ్యాలపై విశ్వాసం ఉంచి తనకు ఎల్లప్పుడూ అండగా ఉన్న బీసీసీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. యూపీ క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్, రాజీవ్ శుక్లాతో పాటు తన అభిమానులందరికి ఆయన ప్రత్యేకంగా కృతజ్జతలను ఆయన తెలిపారు.
గతంలో ఐపీఎల్లో రైనా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడారు. ఐపీఎల్లో చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించారు. 2022 సీజన్లో వేలంలో రైనా ఏ జట్టు ఎంపిక చేయలేదు. ఇది ఇలా ఉంటే 2020లోనే ఆయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగారు.
226 వన్డేలు ఆడిన రైనా 5615 రన్స్ సాధించాడు. ఇక 78 టీ20ల్లో ఆయన 1605 పరుగులు చేశాడు. సెప్టెంబర్ 10నుంచి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్ లో తాను ఆడనున్నట్టు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.