3 వన్డేల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ 12 పరుగుల స్వల్ప తేడాతో భారత్ గెలిచింది. శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో తొలుత భారత్ 349 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 337 పరుగులకే కుప్పకూలింది. శుభ్‌మన్ 149 బంతుల్లో 208 పరుగులతో అదరగొట్టాడు. న్యూజిలాండ్ తరఫున బ్రాస్‌వెల్ 78 బంతుల్లో 140 పరుగులతో అద్భుతంగా ఆడాడు. బ్రాస్‌వెల్ టీమిండియాకు చివరి ఓవర్ వరకు చెమటలు పట్టించినప్పటికీ, శార్దూల్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది.
వన్డేల్లో అద్భుత డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ శుభ్‌మన్. ఇతని వయస్సు 23 ఏళ్ల132 రోజులు. అంతకుముందు ఇషాన్ కిషన్ (24 ఏళ్ల 145 రోజులు), రోహిత్ శర్మ (26 ఏళ్ల 186 రోజులు), ఫఖర్ జమాన్ (28 ఏళ్ల 100 రోజులు), మార్టిన్ గుప్టిల్ (28 ఏళ్ల 171రోజులు) ఉన్నారు. భారత్ తరఫున సచిన్, సెహ్వాగ్, రోహిత్, ఇషాన్ తర్వాత డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. న్యూజిలాండ్‌పై భారత్ బ్యాట్స్‌మెన్ అత్యధిక స్కోర్ కూడా ఇదే. 1999లో హైదరాబాద్‌లోనే సచిన్ 186 పరుగులు చేయగా, ఇప్పుడు శుభ్‌మన్ 208 చేశాడు.
ఇక టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న సిరాజ్ ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌లోను మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇటీవల శ్రీలంక వన్డేలో అద్భుతంగా ఆడాడు. చివరి వన్డేలో పేస్‌తో ముగ్ధుల్ని చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సొంతగడ్డపై మంచి ప్రదర్శన కనబరిచాడు. సిరాజ్ 10 ఓవర్లలో 46 పరుగులు మాత్రమే ఇచ్చి, నాలుగు వికెట్లు తీశాడు.