తెలుగుదేశం పార్టీ విజయవాడ (Vijayawada) ఎంపీ కేశినేని నాని (Kesineni Srinivas) సంచలన వ్యాఖ్యలతో కలవరం రేపుతున్నారు. నిన్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం కురిపించగా.. తాజాగా అభివృద్ధి (Development) కోసం తాను ఎవరితోనైనా జత కట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ ప్రకటనలో ఎన్టీఆర్ జిల్లాతోపాటు టీడీపీలో కలకలం రేపింది. అంటే విజయవాడ ఎంపీ సీటు కోసం వైసీపీతోనైనా చేరేందుకు సిద్ధమని పరోక్షంగా ప్రకటించినట్లు తెలుస్తోంది.
నిన్న నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావును ప్రశంసించడంపై సోమవారం ఎంపీ నాని స్పందించారు. అభివృద్ధి కోసం జగన్మోహనే కాదు ముళ్లపందితోనైనా కలిసి పని చేస్తానని ప్రకటించారు. తెలంగాణ (Telangana) కోసం గొంగళి పురుగును ముద్దాడుతా అని కేసీఆర్ (KCR) అన్నారు.. నేను విజయవాడ అభివృద్ధి కోసం ముళ్ల పందితో (Pig) అయినా కలుస్తా అని సంచలన ప్రకటన చేశారు. ఎంపీగా ఉన్న తాను పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేయాలంటే అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు (MLAs) సహకరించాలి. వైసీపీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ఉదయభాను, జగన్మోహన్ సమన్వయం చేసుకోవడంతోనే ఎంపీ ల్యాండ్ నిధులు ఇచ్చి పనులు చేస్తున్నా అని తెలిపారు. ఎమ్మెల్యేలు ఇద్దరు తనకు నాలుగేళ్లుగా తెలుసని ఎంపీ నాని (Kesineni Nani) చెప్పారు.
‘ప్రతిపక్ష పార్టీలతో సిద్ధాంతపరమైన ఫైట్ (Fight) ఉంటుంది. కానీ విజయవాడ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పని చేస్తా. నేను ఢిల్లీ (Delhi) మనిషిని.. నేను ఎంపీగా ఉన్నా లేకపోయినా నాకు ఉన్న పరిచయాలతో బెజవాడ ప్రజలకు సేవ చేస్తా. నేను ఏమైనా మాట్లాడితే పార్టీ మారుతున్నా అని ప్రచారం చేస్తున్నారు. నా వల్ల టీడీపీకి నాలుగు ఓట్లు పడాలి అనేలా పని చేస్తాను’ అని తెలిపారు. తనను తాను నితిన్ గడ్కరి, చంద్రబాబు (Chandrababu) శిష్యుడినని ప్రకటించుకున్నారు. తన శ్వాస, ఊపిరి అన్ని బెజవాడ పార్లమెంట్ కోసమే ఉంటుందని స్పష్టం చేశారు. ఎంపీ టికెట్ రాకపోతే కేశినేని భవన్ (Kesineni Bhavan)లో కూర్చొని బెజవాడ ప్రజలకు సేవ చేసుకుంటానని కూడా కేశినేని నాని తెలిపారు.