తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పార్టీ కోసం ఆయన చేస్తున్న కృషిని మోదీ కొనియాడారు. మోదీ అధ్యక్షతన ఇటీవల ఎన్డిఎంసి కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజుల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు పార్టీ కీలక నేతలంతా హాజరయ్యారు. 35 మంది కేంద్ర మంత్రులు, 12 మంది సిఎంలు, ఐదుగురు డిప్యూటీ సిఎంలు, అన్ని రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు సహా 350 మంది ప్రతినిధులు ఉన్నారు. కాగా… వారందరి ముందు బండి సంజయ్ ని మోదీ మెచ్చుకోవడం విశేషం.
శెభాష్ బండి జీ అంటూ మోదీ ప్రశంసించడం విశేషం. అంతేకాకుండా… బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను కూడా మెచ్చుకున్నట్లు సమాచారం. పార్టీని బలోపేతం చేయడానికి అలాంటి యాత్ర చేపట్టడం చాలా మంచి నిర్ణయమని, ఆయన కృషిని అభినందించారు. సంజయ్ మంచి వక్త.. ఆయన మాట్లాడుతుంటే వెంకయ్యనాయుడు గుర్తుకు వస్తారని మోదీ కితాబునిచ్చారు.
బీజేపీ రాజకీయ కార్యకలాపాల గురించి పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతున్న సందర్భంగా సంజయ్కు అవకాశం వచ్చింది. ఆయన హిందీలో మాట్లాడబోతుంటే మోదీ కలుగచేసుకుని బావోద్వేగాలగురించి మాతృభాషలో మాట్లాడుతుంటే బాగుంటుందని తెలుగులోనే మాట్లాడమని ప్రోత్సహించారు. సంజయ్ యాత్ర అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందని, అయితే ఆయన తన గురించి తాను చెప్పుకోరని ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. సంజయ్ తెలుగులో మాట్లాడుతుంటేనే బాగా ఉంటుందన్నారు.