»Himanta Biswa Sarma Details Of Rahul Gandhis Dupe Will Be Revealed
Himanta Biswa Sarma: రాహుల్ గాంధీ డూప్ వివరాలు బయటపెడతా!
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వవర్మ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ డూప్ ఉన్నారని, అతని వివరాలు త్వరలో బయటపెడతానని పేర్కొన్నారు.
Himanta Biswa Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వవర్మ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ డూప్ ఉన్నారని, అతని వివరాలు త్వరలో బయటపెడతానని పేర్కొన్నారు. అచ్చం రాహుల్లా కనిపించే వ్యక్తి యాత్రలో ఉన్నారంటూ ఆయన తెలిపారు. నేను కేవలం వాస్తవాలు మాత్రమే చెబుతా.. రాహుల్ గాంధీ డూప్ వివరాలతో పాటు అతడి పేరును వెల్లడిస్తానని తెలిపారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందని సోనిత్పుర్లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. ముఖ్యమైన పనిమీద దిబ్రూగఢ్ వెళ్లాల్సి ఉందని.. గువాహటికి చేరుకున్న వెంటనే ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తానని.. అంతవరకు వేచి ఉండండన్నారు.
ఇటీవల యాత్రలో భాగంగా గువాహటి సరిహద్దు వద్ద కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి రాష్ట్ర పోలీసులకు మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో రాహుల్ సహా మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులకు సంబంధించి లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన అనంతరం అరెస్టులు ఉంటాయని హిమంత వెల్లడించారు. జనవరి 14న మణిపుర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర 110 జిల్లాలు 100 లోక్‌సభ స్థానాల మీదుగా 67 రోజుల పాటు కొనసాగనుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో యాత్ర కొనసాగుతోంది.