Vikas Raj: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ (Vikas Raj) తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డులు వినియోగించోవచ్చని సూచించారు. ప్రత్యేక ఓటర్లకు సౌకర్యాలు ఉంటాయని.. రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో బ్రెయిలీ బ్యాలెట్ పత్రాలు ఉంటాయని స్పష్టంచేశారు.
అఫిడవిట్లో అన్ని కాలమ్స్ అభ్యర్థులు విధిగా నింపాలని కోరారు. లేదంటే అప్లికేషన్ తిరస్కరణకు గురవుతుందని తెలిపారు. నమూనా, మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. ఫిర్యాదుల కోసం 1950ను సంప్రదించాలని.. ప్రకటనల కోసం ముందుగా అనుమతి తీసుకోవాలని సూచించారు.
బ్యాలెట్ పత్రాలపై గుర్తులతోపాటు అభ్యర్థుల ఫోటోలు ఉంటాయని వివరించారు. ప్రభుత్వ అధికార వెబ్ సైట్లలో రాజకీయ నేతల ఫొటోలు తొలగించాలని కోరారు. అక్టోబర్ 31వ తేదీ వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అడ్రస్ మార్పు అప్లికేషన్ను ఈ రోజు నుంచి వాయిదా వేస్తున్నామని వివరించారు. నగదు ఉంటే దానికి సంబంధించిన పత్రాలు, వివరాలు ఉండాలని చెప్పారు.
సమస్మాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపు కసరత్తు జరుగుతుందని వికాస్ రాజ్ తెలిపారు. నగదు లావాదేవీలు, మద్యం సరఫరాకు సంబంధించి పూర్తి పర్యవేక్షణ ఉంటుందని తేల్చిచెప్పారు.