మనలో చాలా మంది చిన్న కష్టానికే కుంగిపోతారు. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్యలకు పాల్పడేవారు కూడా ఉన్నారు. అయితే.. ఎంత కష్టమొచ్చినా ఎదురించగల సత్తా ఉంటే.. జీవితంలో ఏదైనా సాధించవచ్చని ఓ మహిళ నిరూపించింది. కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు.. తన కుటుంబానికి మూడు పూటలా తిండి పెట్టేందుకు ఓ మహిళ క్యాబ్ డ్రైవర్ గా మారింది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఒక వ్యక్తి తాను బెంగుళూరులో ఉబెర్‌ను బుక్ చేసుకుంటే.. తనను పికప్ చేసుకోవడానికి ఒక మహిళా డ్రైవర్ వచ్చింది. ఓ మహిళ క్యాబ్ నడపడంతో ఆశ్చర్యానికి గురైన అతను.. ఆమె కథ తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆమె కథను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఆ మహిళ ముందుగా ఫుడ్ బిజినెస్ చేసేదని.. అందులో నష్టాలు రావడంతో ఉబర్ డ్రైవర్ గా మారిందని పేర్కొన్నారు.
రాహుల్ శశి అనే వ్యక్తి ఆమె కథను షేర్ చేయడం గమనార్హం. తనకు తన ఫ్రెండ్ క్యాబ్ బుక్ చేయగా.. నందిని అనే అమ్మాయి డ్రైవర్ గా వచ్చిందని ఆయన తన బ్లాగ్ లో పేర్కొన్నాడు. ఆమె తోపాటు.. కారులో ఆమె పాప కూడా ఉండటం విశేషం. పాప గురించి అడగగా.. ఆమె తన కథను అతనితో పంచుకుంది. ఆమె కుటుంబాన్ని పోషించడానికి ముందు ఫుడ్ బిజినెస్ పెట్టిందట. అయితే… అది కలిసిరాకపోవడంతో…. బిజినెస్ లో నష్టం రావడంతో… ఇలా ఉబర్ డ్రైవర్ గా మారడం గమనార్హం.
నిజానికి నందిని మహిళ వ్యాపారవేత్త కావాలనుకుందని.. అందుకోసం తాను పొదుపు చేసిన డబ్బులతో కొన్నేళ్ల క్రితం ఫుడ్ ట్రక్‌ను ప్రారంభించిందని పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, కోవిడ్ వెలుగులోకి వచ్చిన తర్వాత.. తన బిజినెస్ పై తీవ్ర ప్రభావం చూపించిందని.. పెట్టిన పెట్టుబడి డబ్బు మొత్తాన్ని కోల్పోయినట్లు నందిని తెలిపింది. అందుకనే ఆమె ఉబెర్ క్యాబ్ డ్రైవింగ్ వృత్తిని ప్రారంభించింది. రోజుకు 12 గంటలు పని చేస్తుంది. “మళ్ళీ తాను డబ్బును ఆదా చేసి.. తాను కోల్పోయిన ప్రతిదానిని తిరిగి పొందాలని నందిని కోరుకుంటుందని రాహుల్ చెప్పారు.
రాహుల్ చేసిన పోస్ట్ తో నందిని పట్టుదలకు మద్దతు, ప్రశంసలు లభిస్తున్నాయి. అంతేకాదు రాహుల్ శశి మహిళా డ్రైవర్ తో ఉన్న ఫోటోని కూడా షేర్ చేశాడు. చాలా మంది నెటిజన్లు కష్టపడి పనిచేస్తున్న నందిని ప్రశంసిస్తున్నారు.