ప్రధాని నరేంద్ర మోడీ దేవుడు అని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అంటున్నారని, అసలు ఆయన ఎవరికి దేవుడో చెప్పాలని మంత్రి కేటీఆర్ నిలదీశారు. దేవుడు అన్న వ్యక్తికా, లేక గుజరాత్‌కు దేవుడా చెప్పాలని ప్రశ్నించారు. తన హయాంలో గ్యాస్ నుండి నిత్యావసర ధరలు భారీగా పెరిగాయని, అందుకు ఆయన దేవుడు అవుతారా అన్నారు. గ్యాస్ ధర రూ.వెయ్యి దాటిందని, పెట్రోల్ ధర రూ.100 దాటిందని, ఢిల్లీలో ఆందోళన చేసిన రైతులను కొట్టించారని, గిరిజనుల రిజర్వేషన్ పెంచాలని చెబితే పట్టించుకోవడం లేదని.. ఇందుకు ఆయన దేవుడు అవుతారా అన్నారు.
కేంద్రానికి తెలంగాణ నుండి రూపాయి వెళ్తుంటే, అక్కడి నుండి మనకు 45 పైసలు మాత్రమే వస్తున్నాయని, మిగతా 55 పైసలు బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెళ్తున్నాయని, ఇది నిజమో కాదో వాళ్లే చెప్పాలన్నారు. కరోనా సమయంలో కుర్ కురేలు పంచడం, ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మినహాయించి కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణలో ఎనభై వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వగా, బండి సంజయ్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని చెప్పడం సరికాదన్నారు. కర్నాటక-మహారాష్ట్రలు కొన్ని గ్రామాల కోసం రెండు నెలలుగా కొట్లాడుతుంటే, దానిని పరిష్కరించలేని మోడీని, బీజేపీ నేతలు మాత్రం ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న యోధుడు అంటున్నారని ఎద్దేవా చేశారు.