ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. కాస్త తగ్గుముఖం పట్టిందనుకునేలోపు.. బీఎఫ్7 రూపంలో కొత్త వేరియంట్ కలకలం రేపడం మొదలుపెట్టింది. దీనికే ప్రజలు భయపడుతుంటే… తాజాగా కొత్తరకం మరో వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఇది మరింత ప్రమాదకారిగా తెలుస్తోంది. మెదడు తినే అమీబా ఒకటి కొత్తగా పుట్టుకు వచ్చింది. దీని కారణంగా దక్షిణ కొరియాలో ఓ వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోవడం గమనార్హం.
దీన్నే నగలేరియా ఫ్లవరీ ఇన్ఫెక్షన్ అంటారు. ఈ వ్యాది సోకి ఆ దేశంలో 50 ఏళ్ల ఓ వ్యక్తి మరణించాడు. అయితే అతనికి థాయిలాండ్‌లో ఆ ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
డిసెంబర్ 10వ తేదీన ఆ వ్యక్తి కొరియా వచ్చాడు. అంతకుముందు నాలుగు నెలల పాటు ఆయన థాయ్‌లాండ్‌లో ఉన్నారు. ఈ ఇన్ఫెక్షన్ గురించి కొరియా వ్యాధుల నియంత్రణ ఏజెన్సీ పేర్కొన్నది.డిసెంబర్ 10న థాయ్‌లాండ్ నుంచి వచ్చిన వ్యక్తి(50) ఆ మరునాడే ఆస్పత్రిలో చేరాడని, గత మంగళవారం చనిపోయాడని అధికారులు వివరించారు. దేశంలో ఇదే తొలి కేసు అని దక్షిణ కొరియా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది.ఈ వ్యక్తి నివసించే ప్రాంతంలోని ప్రజలు.. కొలనులు, కాలువల్లోకి దిగి ఈత కొట్టవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.