ఉత్తర ప్రదేశ్ లో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20 కోచులు పట్టాలు తప్పాయి. సబర్మతి ఎక్స్ప్రెస్ అహ్మదాబాద్ – వారణాసి మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్. ఉత్తర్ ప్రదేశ్ వారణాసి కి ఉదయం 10 గంటలకు చేరుకోవాల్సి ఉంది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ఆగష్టు 17 అర్ధరాత్రి సుమారు 2:30 గంటలకు ప్రమాదం సంభవించింది. ఇంజిన్ ముందు ఉండే క్యాటిల్ గార్డ్ ధ్వంసమైంది.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఘటనపై తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రమాద స్థలంలో 16వ కోచ్ వద్ద ఒక వస్తువు కనుగొనబడిందని చెప్పారు. ఆ వస్తువు సంబంధించి సాక్ష్యాలను సురక్షితంగా ఉంచడం జరిగిందని చెప్పారు. ఈ అంశంపై మరింత విచారణ కొనసాగుతుందని చెప్పారు.
ప్రమాదంలో ఎలాంటి మృతులు సంభవించలేదని, ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేరువగా పంపించామని తెలిపారు. ప్రయాణికులు సురక్షితంగా చేరుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి రైల్వే అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.