KMR: వరి ధాన్యం సేకరణకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ క్వింటాలుకు రూ.2,320, సాధారణ రకానికి రూ.2300, సన్నరకం వడ్లకు అదనంగా రూ.500/- చెల్లిస్తుందని తెలిపారు. సన్నరకం ధాన్యం ఉంచడానికి ఎర్ర దారంతో బస్తాలు కుట్టాలన్నారు.
సత్యసాయి: పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి వద్ద నేషనల్ హైవేలో గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అనంతపురం నుండి బెంగళూరు వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన పది అడుగుల లోతులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్రేన్ సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు.
ATP: హాస్టల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు మంత్రి సవిత తెలిపారు. గురువారం ఏలూరు జిల్లా చోదిమెళ్ళ పంచాయితీ, వంగూరు రోడ్డులో ఉన్న ఎంజేపీ స్కూల్‌ను మంత్రి తనిఖీ చేశారు. ఈసందర్భంగా హాస్టల్ విద్యార్థులతో సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ గదులను పరిశీంచారు. కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు.
MDK: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్‌లో ఇంఛార్జి మంత్రి సురేఖతో కలిసి వ్యవసాయం, జిల్లా గ్రామీణ అభివృద్ధి, మార్కెటింగ్ సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. రైతులకు సకాలంలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
CTR: డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్ 14 బాల, బాలికల జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించినట్లు కార్యదర్శి ఎస్. బాబు పేర్కొన్నారు. ఈ పోటీలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి 287 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. బాలికల విభాగంలో 13 మంది, బాలుర విభాగంలో 12మంది ఎంపికైనట్లు వెల్లడించారు.
KMM: ముదిగొండ మండల పరిధిలో అమ్మపేటలో పత్తి, మిర్చి, వరి పంటలను వ్యవసాయ శాఖ మధిర డివిజన్ సహాయ సంచాలకులు ఎస్ విజయ్ చంద్ర గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా పంటలను పరిశీలించి ఆయన రైతులతో మాట్లాడారు. ఈ ఏడాది అధిక వర్షాలకు పంటలకు తెగుళ్లు బెడద ఉంటుందని అన్నారు. పత్తిలో రసం పీల్చు పురుగులు, గులాబీ రంగు పురుగు ఆశించినట్లు గుర్తించారు.
అన్నమయ్య: పది రూపాయల నాణేలపై అపోహలు వీడి అన్ని లావాదేవీలలో ఉపయోగించాలని ఇండియన్ బ్యాంకు మేనేజర్ హరినాథ్ గుప్తా సూచించారు. పట్టణంలో బ్యాంకులో గురువారం 10 రూపాయల నాణేలపై అవగాహన కల్పించారు. పట్టణంలో జనసంచారం ఎక్కువగా ఉన్న కూడళ్ళలో, దుకాణాల వద్ద పది రూపాయల నాణేల చెలామణిపై ముద్రించిన స్టిక్కర్లను అతికించారు.
CTR: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కలికిరిలో చోటుచేసుకుంది. సీఐ రెడ్డిశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కలికిరి వయా కలకడ రహదారిపై అద్దవారిపల్లి సమీపంలో కారు బైకిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న సోమల మండలం టీ.చెరుకువారిపల్లికి చెందిన కె.కృష్ణయ్య తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పీలేరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
SKLM: రణస్థలం వద్ద 6లైన్లతో హైవే విస్తరణకు రూ.252.42 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ X ద్వారా తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ శ్రీకాకుళం – విశాఖపట్నం మధ్య ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో పాటు ఆర్థిక ప్రగతికి తోడ్పడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
SRPT: ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ మాదిగలను మోసం చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఈనెల 29న జిల్లా కేంద్రంలో జరిగే మాదిగల ధర్మయుద్ధ సదస్సును జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మాదిగలకు ద్రోహం చేస్తున్నారన్నారు.
W.G: పాలకొల్లు ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26శనివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. రాజరాజేశ్వరి గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన నిరుద్యోగులు తమ ఫోటో ఉన్న రెస్యూమ్‌తో పాల్గొనాలని కోరారు.
ATP: ఈనెల 25 నుంచి 2025 ఫిబ్రవరి 28వ తేదీ వరకు అఖిల భారత పశుగణన కార్యక్రమం జరుగుతుందని పశుసంవర్ధకశాఖ ఉరవకొండ డీడీ డాక్టర్ జీ.వెంకటేశ్ తెలిపారు. పశుగణన కోసం ఇంటికి వచ్చే విషయ సేకరణ దారులకు పశువుల సమగ్ర సమాచారం అందించాలన్నారు. పశుగణన ద్వారా పథకాల రూపకల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయన్నారు.
KDP: కొండాపురం మండలంలోని గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ గురప్ప అన్నారు. గురువారం మండలంలోని సుగుమంచి పల్లెలో రెవెన్యూ గ్రామసభ నిర్వహించారు. పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న లోటు పాట్లను సవరించేందుకు రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో ఆస్ఐ మహేశ్వర్ రెడ్డి, మండల సర్వేయర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
NZB: ఈనెల 26న తెలంగాణ యూనివర్సిటీలో కబడ్డి క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డా.బీ.ఆర్ నేత ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ డిగ్రీ కళాశాలల క్రీడాకారులు 25 సంవత్సరాలలోపు ఉన్న పురుషుల ఈ ఎంపికలకు అర్హలు అన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు చెన్నైలో జరగబోయే సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటారని అన్నారు.
HNK: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు పెండింగ్ ఉండకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.