Manipur Violence: మణిపూర్‌లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. ఇంకా తీవ్రరూపం దాల్చకముందే కేంద్ర ప్రభుత్వం యాక్షన్ మోడ్‌లోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. మణిపూర్ హింసాకాండపై అన్ని పార్టీలతో చర్చించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ 24న న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మే 3న రాష్ట్రంలో ఆదివాసీల హింసాకాండ మొదలైంది, ఇది ఇప్పటివరకు కొనసాగుతోంది. ఈ హింసాకాండ కారణంగా ఇప్పటి వరకు 110 మంది చనిపోయారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తారని, ఇందులో మణిపూర్‌లో పరిస్థితిని చర్చిస్తారని హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి బుధవారం సాయంత్రం ట్వీట్ చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ న్యూఢిల్లీలో హోంమంత్రిని కలిసిన సమయంలో ఈ సమావేశం ప్రకటించబడింది. హిమంత బిస్వా శర్మ NDA ఈశాన్య విభాగం అయిన NEDA (నార్త్-ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్)కి కన్వీనర్. ఈయన జూన్ 10న రాష్ట్రాన్ని సందర్శించారు.
కేంద్రంపై ప్రతిపక్షాల విమర్శలు
మణిపూర్ హింసకు సంబంధించి ప్రతిపక్షాలు తన ప్రశ్నలతో కేంద్ర ప్రభుత్వాన్ని నిరంతరం విమర్శిస్తున్నాయి. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడంపై ప్రతిపక్షాలు కూడా ప్రశ్నలు సంధించాయి. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ బుధవారం మాట్లాడుతూ.. హింసాకాండ కారణంగా రాష్ట్రం తీవ్ర గాయాలపాలైందన్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. అఖిలపక్ష సమావేశానికి ఒకరోజు ముందు అంటే జూన్ 23న కనీసం 30 ప్రతిపక్ష పార్టీల నేతలు పాట్నాలో సమావేశం కానున్నారు. ఇందులో 2024లో బీజేపీని చుట్టుముట్టేందుకు వ్యూహం రచించనున్నారు.
సమావేశంలో ఏం చర్చిస్తారు?
అందిన సమాచారం ప్రకారం.. పార్లమెంటులోని లైబ్రరీ భవనంలో హోంమంత్రి అమిత్ షా అన్ని పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ఇందులో రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను ప్రతిపక్ష నేతలు, మిత్రపక్షాలకు తెలియజేయనున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా చెప్పనున్నారు. సీఆర్పీఎఫ్ డీజీ సుజోయ్ లాల్ థాసేన్ కూడా కొద్ది రోజుల క్రితం మణిపూర్‌లో పర్యటించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన భద్రతా సిబ్బందిని కలిశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆయన చర్చించారు.