Captcha : ఇది ఇంటర్నెట్ ప్రపంచం. కాసేపు నెట్ లేకపోతే ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది. అంతగా మనిషి ఇంటర్నెట్(Internet) కు బానిసై పోయాడు. ప్రస్తుతం నెట్ లేకుండా ఏపని కాదు. స్మార్టు ఫోన్(Smartphone) అందుబాటులోకి వచ్చాక నెట్ వాడకం విపరీతంగా పెరిగింది. రోజుకో టెక్నాలజీ(Technology) ఇంటర్నెట్లో ప్రత్యక్షం అవుతున్నాయి. సాంకేతికత రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. స్మార్ట్ ఫోన్ దానికి ఇంటర్నెట్ అనుసంధానం అయి వుంటే ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం. ఈ సమయంలోనే వ్యక్తిగత భద్రత(Security) కూడా చాలా ముఖ్యం. దానిని కాపాడే ప్రయత్నంలోనే అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ క్యాప్చా. ఇంటర్నెట్ వాడే ప్రతిఒక్కరికీ ‘ఐ యామ్ నాట్ ఏ రోబోట్’ అనే క్యాప్చా పక్కా తెలిసే ఉంటుంది.
అవసరం నిమిత్తం ఏదైనా వెబ్సైట్(Website) ఓపెన్ చేసినప్పుడు ఈ క్యాప్చా కనిపిస్తుంది. ఇలా వచ్చినప్పుడు పక్కనే ఉన్న బాక్స్‌లో టిక్ చేస్తే కానీ సదరు వెబ్ సైట్ లోకి వెళ్లలేము. క్యాప్చా ఓకే అయితేనే ఏదైనా పని చేసుకోవడానికి వీలవుతుంది. ‘ఐ యామ్ నాట్ ఏ రోబోట్’ అనేదే కాకుండా.. క్యాప్చా(Captcha)లలో విభిన్నరకాలున్నాయి. వివిధ రకాల బొమ్మలు వచ్చి వాటిల్లో సరైన వాటిని ఎంపిక చేయాలని కోరుతుంది. వాటిని సరిగ్గా ఎంపిక చేస్తేనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా ఎందుకు వస్తాయి? అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం.
2000వ సంవత్సరంలో క్యాప్చాను అభివృద్ది చేశారు. వినియోగదారుడి సమాచార భద్రత, వెబ్సైట్ల రక్షణ కోసమే తీసుకొచ్చారు. దాదాపు అన్ని వెబ్ సైట్లు క్యాప్చా పద్దతిని పాటిస్తున్నాయి. రోబోలు, ఆటోమేటెడ్ ప్రొగ్రాం(Automatic programme)ల నుంచి హానీ జరగకుండా క్యాప్చా రక్షిస్తుంది. క్యాప్చా ప్రక్రియను మనం పూర్తి చేస్తున్న సమయంలో కర్సర్ కదలికలు ఆటోమేటిక్‌గా ట్రాక్(Track) అవుతాయి. మనిషి చేసే కదలికలను సూక్ష్మస్థాయిలో రోబోలు పరిశీలిస్తుంది. దీని వల్ల మానవుడే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నాడని అంచనా వేస్తుంది. అలాగే వినియోగదారుడి పరికరంలోని బ్రౌజర్ ద్వారా నిల్వచేసిన కుకీలతో పాటు ఇంతకుముందు శోధించిన విషయాలను కూడా క్యాప్చా ట్రాక్ చేస్తుంది. ఇవన్నీ ట్రాక్ చేయడం ద్వారా మనిషే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నాడని, రోబోట్ కాదని కంప్యూటర్(Computer)కు తెలుస్తోంది. స్పామ్, పాస్వర్డ్ డిక్రిప్షన్, సైబర్ దాడులు, హానికరమైన మాల్వేర్ల(Malware) నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. అందుకే దాదాపు ఆన్లైన్(online)లో బ్యాంకు లావాదేవీలు నిర్వహించే సమయంలో క్యాప్చా తప్పనిసరిగా ఉంటుంది.