తెలంగాణ బీజేపీలో కోవర్టు కామెంట్స్ కలకలం రేపాయి. అన్నీ పార్టీలో సీఎం కేసీఆర్‌కు కోవర్టులు ఉన్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోశాయి. వెంటనే రాములమ్మ విజయశాంతి స్పందించారు. ఎవరో ఆ కోవర్టులు బయటపెట్టాలని కోరారు. ఈ ఇద్దరు నేతల మధ్య పడటం లేదని తెలుస్తోంది. బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటే? ఈటల రాజేందర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీ ఇవ్వాలని హైకమాండ్ అనుకుందట. ఆ ప్రతిపాదనకు రాములమ్మ అడ్డు పడ్డారని విశ్వసనీయ సమాచారం. అప్పటినుంచి ఈటల రాజేందర్ వర్సెస్ విజయశాంతి మధ్య డైలాగ్ వార్ జరుగుతూనే ఉంది.
కోవర్టులను పేర్లతో సహా బయటపెట్టాలని విజయశాంతి కోరారు. పార్టీలో నిజంగా కోవర్టులు ఉంటే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కోవర్టులతో పార్టీకి నష్టమే, వారిపై హైకమాండ్ యాక్షన్ తీసుకుంటుందని విజయశాంతి అన్నారు. కోవర్టుల గురించి చెప్పి పార్టీకి మేలు చేసినవారు అవుతారని ఈటల రాజేందర్‌కు సూచించారు. ఊరికో కోవర్టులు అని చెప్పి తప్పించుకోవడం సరికాదన్నారు. దొంగతనం జరిగితే ఆ దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత ఉండదా అని అడిగారు. వారిని పోలీసులకు ఎలా అప్పగిస్తామో.. కోవర్టుల గురించి హైకమాండ్‌కు తెలియజేయాలని కోరారు.
ఈటల రాజేందర్- రాములమ్మ విజయశాంతి కామెంట్ల నేపథ్యంలో బండి సంజయ్ రంగంలోకి దిగారు. బీజేపీలో కోవర్టులు ఉండరు అని తేల్చిచెప్పారు. సిద్దాంతం కలిగిన పార్టీలో కోవర్టులకు ఆస్కారం లేదని చెప్పారు. ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. నిజానికి ఈటల- విజయశాంతి ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేశారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోకి కూడా వెళ్లారు. ఈటల రాజేందర్ మాత్రం ఉద్యమం సమయం నుంచి టీఆర్ఎస్లోనే ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఇద్దరి మధ్య ఆధిపత్య ధోరణి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.